సిరిసిల్ల నేతన్న విలవిల..మూతపడ్డ టెక్స్ టైల్ పార్క్!

  •     భారంగా మారిన కరెంట్ చార్జీలు
  •     అమ్ముడుపోని కోటి మీటర్ల బట్ట 
  •     ఆర్థిక ఇబ్బందులతో ఆగిన మరమగ్గాలు
  •     బీఆర్ఎస్ హయాంలోనే మొదలైన పతనం
  •     రెండు రోజుల కింద అన్ని యూనిట్లు క్లోజ్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు : తెలంగాణలో మొట్టమొదటి టెక్స్ టైల్ పార్క్ మూతపడింది. సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ లో ఉత్పత్తి అయిన బట్టకు ధర లేక నిల్వలు పేరుకుపోయాయి. ఓ వైపు విద్యుత్ చార్జీల భారం మోయలేక, మరోవైపు పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగామార్కెట్ ధర రాక కొన్నేండ్లుగా టెక్స్​టైల్స్​ పార్క్​ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో చేసేది లేక మంగళవారం వ్యాపారులు టెక్స్ టైల్ పార్క్ లోని మిగిలిన పరిశ్రమలను మూసివేశారు.  

115 పరిశ్రమలతో కళకళలాడి...

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో 2002లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. అప్పట్లో నేతన్నలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో వారి పరిస్థితిని మెరుగుపరచడానికి ఆనాటి కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ విద్యాసాగర్ రావు చొరవతో 60 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 

రూ.7.76 కోట్ల అంచనాతో ఈ పార్క్ నిర్మించారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి టెక్స్ టైల్ పార్క్. నేత వృత్తిలో ఉన్న వారికి పార్క్ లో పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తూ 217 ప్లాట్లను విభజించి కేటాయించారు. దీంతో ఏడాదిలోనే 115 వరకు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. మొదటి పదేండ్లు బాగానే నడిచి వ్యాపారులు లాభాలు ఆర్జించినా, ఆ తర్వాతే  కష్టాలు మొదలయ్యాయి. 

విద్యుత్ చార్జీల భారంతో కుదేలు..

గతేడాది వరకు 40 పరిశ్రమలను మూసివేయగా, బీఆర్ఎస్​హయాంలోనే 60 వరకు మూతపడ్డాయి. 40 యూనిట్లు కొనసాగుతుండగా గత మంగళవారం వీటిని కూడా వ్యాపారులు క్లోజ్​ చేశారు. దీనికంతటికి విద్యుత్ భారమే ప్రధాన కారణమైంది. వస్త్రోత్పత్తిదారులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.75  పైసలున్నప్పుడు లాభాల బాటలో పయనించారు. ఆరేండ్ల కింది వరకు ఇవే ఛార్జీలు ఉండడంతో ఇబ్బంది లేకుండా నడిచింది. కానీ,  తర్వాత యూనిట్​కు రూ.8 చేయడంతో అదనపు భారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడంతో వ్యాపారులు నష్టాల వైపు పయనించారు. 

ఇండస్ట్రియల్ ​జోన్​ కింద ఉండడంతో..

టెక్స్ టైల్స్ పార్క్​ఇండస్ట్రీ కేటగిరి–3 ప్రకారం ఇండస్ట్రియల్ జోన్ కింద ఉండడంతో తప్పనిసరిగా యూనిట్​కు రూ. 8 కట్టాల్సి వస్తున్నది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు.మహారాష్ట్ర , గుజరాత్ లాంటి ప్రాంతాల్లో యూనిట్​కు కేవలం రూ. 4 మాత్రమే తీసుకుంటున్నారు. అదే విధంగా సిరిసిల్లలో బతుకమ్మ చీరల క్లాత్​  ఉత్పత్తి చేసే ఎస్ఎస్ఐ, మ్యాక్స్ సంఘాలను కేటగిరి –4 ప్రకారం కుటీర పరిశ్రమల కింద చేర్చి యూనిట్​కు రూ.4 చార్జీ మాత్రమే వసూలు చేస్తున్నారు. వీరికి యూనిట్​కి రూ.2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. కానీ, కష్టాల్లో ఉన్న టెక్స్ టైల్ పార్క్ వ్యాపారులకు మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. 

కేటీఆర్​ హామీ ఇచ్చి నెరవేర్చలే...

నాలుగేండ్ల  కింద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​ను కలిసిన టెక్స్​టైల్ ​పార్క్​ వ్యాపారులు విద్యుత్​ చార్జీల రాయితీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.  తప్పకుండా రాయితీ ఇస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్​ తర్వాత మాట నిలబెట్టుకోలేదు. కరెంట్​బిల్లుల రీయింబర్స్​మెంట్​ చెల్లింపుల్లోనూ ప్రభుత్వం అలసత్వం వహించింది. 2018కు ముందు బకాయిలను 2018లో, తర్వాత 2021లో రీయింబర్స్​మెంట్​చేశారు. 2022 నుంచి ఇప్పటివరకు బకాయిలు ఇవ్వకపోవడంతో వ్యాపారులు తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎక్కువైపోయాయి. 

ఒక్కో వస్త్ర పరిశ్రమ యూనిట్ కు రూ.2 లక్షల నుంచి 6 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ చార్జీలకు తోడు నూలు రేట్లు పెరిగిపోయాయి. ట్రాన్స్​పోర్ట్​ ఛార్జీలు అధికం కావడంతో తయారు చేసిన బట్టను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం కష్టమైంది. 

అంతేగాక రవాణా ఛార్జీల భారం, సప్లై లేట్ చేయడంతో ముంబయితో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేట్ ఆర్డర్లు కూడా ఆగిపోయాయి. ఇంతకుముందు మీటర్ బట్టను మార్కెట్​లో రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుండేవారు. ప్రస్తుతం మార్కెట్​లో ధర లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. ప్రస్తుతం తంగళ్లపల్లి పార్క్​ యూనిట్లలో ఉత్పత్తి అయిన కోటి మీటర్ల క్లాత్​ అలాగే ఉంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు టెక్స్ టైల్ పార్క్ లో పరిశ్రమలను మూసివేయాల్సి వచ్చింది.  

సగం ధరకే 82 సాంచెలు అమ్ముకున్నరు 

పవర్​లూం అప్ గ్రేడేషన్ లో భాగంగా టెక్స్ టైల్ పార్క్ లో ఏర్పాటు చేయడానికి వ్యాపారులు ఒక్కో రాపియర్స్ ను రూ. 4.50లక్షలకు పైగా వెచ్చించి కొన్నారు. ఇప్పుడు పరిశ్రమలు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి సగం ధరకే సాంచె (పవర్​లూమ్స్)​లను అమ్ముకుంటున్నారు. తక్కువ ధరకే వస్తుండడంతో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల వస్త్ర వ్యాపారులు వచ్చి కొనుక్కుపోతున్నారు. టెక్స్ టైల్ పార్క్ లో ఇప్పటికే 115 యూనిట్లలో  82 రాపియర్స్​ను అమ్ముకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిక్కడ కేవలం 30 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. పార్క్ లో ఇంతకుముందు 1200 మంది కార్మికులు ప్రత్యక్షంగా, 2000 మంది కార్మికులు పరోక్షంగా ఉపాధి పొందేవారు. పరిశ్రమల మూసివేతతో దాదాపు 3వేల మంది రోడ్డున పడ్డట్టయ్యింది.  

కొత్త ప్రభుత్వం ఆదుకోవాలి

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల టైక్స్ టైల్ పరిశ్రమను ఆదుకోవాలి. మేం ఉత్పత్తి చేసిన బట్టకు ధర ఇప్పించాలే. నష్టాలను భరిస్తూ ఉత్పత్తి చేయలేక యూనిట్లను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం విద్యుత్ రీయింబర్స్​మెంట్ ​బకాయిలు విడుదల చేయాలి. కొత్త ప్రభుత్వ ఆర్డర్లు ఇప్పించాలి.  
-
 అన్నల్​దాస్​అనిల్ కుమార్, టెక్స్ టైల్ పార్క్      యజమానుల సంఘం అధ్యక్షుడు

పూట గడవటం కష్టంగా ఉంది.

పార్క్ మూసివేయడంతో ఉపాధి కోల్పోయాం. రోజుకు 400 చొప్పున నెలకు రూ.12వేలు సంపాదించే అవకాశం ఉండె. కార్కానా బంద్ కావడం వల్ల పూటగడవటం కష్టంగా మారింది. ప్రభుత్వం చొరవ తీసుకుని పార్క్ ను తెరిపించి పని కల్పించాలి. 
-
 కూచన శంకర్,  టెక్స్ టైల్ పార్క్ కార్మికుడు