మధ్యప్రదేశ్: అత్తమామలే ఆ ఇల్లాలుకు అమ్మనాన్నలయ్యారు. కరోనాతో తన భర్త మరణించడంతో... అత్తమామలే స్వయంగా ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అంతే కాకుండా తమ కుమారుని పేరు మీద ఉన్న ఇంటిని ఆమెకు రాసిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగింది. యుగ్ ప్రకాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్. ఈయనకు భార్య, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి భార్య రిచా, 9 ఏళ్ల కూతురు అనన్య తివారీ ఉన్నారు. అయితే కరోనాతో ప్రియాంక్ తివారీ 2021లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబం.... ప్రియాంక్ తివారీ మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక భార్య రిచా తన భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. నిత్యం అతడి గురించే ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయింది.
కోడలు బాధను చూసి ఆ దంపతులు కుంగిపోయారు. రిచాకు ధైర్యం చెప్పడానికి ఆ దంపతులు రకరకాలుగా ప్రయత్నించారు. అయినా ఆ ఇల్లాలు బాధ నుంచి బయటపడలేక పోయింది. దీంతో కోడలు పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తమామలు ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని కోడలికి చెప్పగా... అందుకు ఆమె ఒప్పుకోలేదు. అయితే ఏదో రకంగా అత్తమామలు ఆమెను ఒప్పించారు. ఈ క్రమంలోనే నాగ్‌పూర్‌కు చెందిన వరుణ్ మిశ్రాతో వివాహం కుదిర్చారు. అనంతరం కోడలు రిచాకు దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఆమెకు మరో కొత్త జీవితాన్నిచ్చారు. అంతే కాకుండా ఆమెకు రూ. 60 లక్షల ఇంటిని రాసిచ్చారు. కుమారుడు చనిపోయినా దగ్గరుండి తమ కోడలికి మరో పెళ్లి చేసిన అత్తమామలను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం...