ఆదిలాబాద్ టౌన్, వెలుగు : పలు సంఘాల ధర్నాలు, ఆందోళనలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి కార్మికులు, ఉద్యోగులు, భూనిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు రైల్వేస్టేషన్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాంట్లు, పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిడ్డే మీల్స్ కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్ బిల్లులు, వేతనాలను మంజూరు చేయాలని కోరారు. ఇచ్చోడ మండలంలో పేద ప్రజలకు కేటాయించిన స్థలాలను వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలువురు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన స్థలాలను ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించడాన్ని ఖండించారు.
మంచిర్యాల : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు మంచిర్యాల కలెక్టరేట్ఎదుట ధర్నా నిర్వహించిన కలెక్టర్ బదావత్ సంతోశ్‌కు మెమోరాండం అందజేశారు. ఐసీడీఎస్‌కు బడ్జెట్ పెంచాలని, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలన్నారు. కనీసం వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 2018లో పెంచిన వేతనాన్ని ఏరియర్స్‌తో సహా చెల్లించాలని, మూడేండ్లుగా పెండింగ్ఉన్న ట్రాన్స్పోర్ట్చార్జీలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అందించాలని కోరారు.