పచ్చని పల్లెల్లో ఫార్మా చిచ్చు

  • పచ్చని పల్లెల్లో ఫార్మా చిచ్చు
  • కృష్ణా, మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు
  • ఇప్పటికే ఫ్లోరైడ్ ​సమస్యతో సతమతం
  • మూసీని ప్రక్షాళనకు డిమాండ్​ చేస్తుంటే ముంచుకొచ్చిన మరో ఆపద
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలవరం
  • అధికార పార్టీ నేతల అండ 
  • ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవట్లే...

నల్గొండ, వెలుగు : ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కృష్ణా, -మూసీ నదుల పరివాహక ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకోనున్నాయి. ఇప్పటిదాకా జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో, మూసీ నది ప్రవాహాల పక్కనే ఏర్పాటైన ఫార్మా కంపెనీలు క్రమంగా పల్లెల్లోకి చొచ్చుకొస్తున్నాయి. కెమికల్​వ్యర్థాలు, ఫ్లోరైడ్​సమస్యతో అతలాకుతలమవుతున్న గ్రామాలను ఇప్పుడు ఫార్మా రూపంలో మరో సమస్య కలవరపెడుతున్నది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీనదిని ప్రక్షాళన చేయాలని డిమాండ్​చేస్తుంటే కొత్తగా గ్రామాల్లో ఫార్మా, కెమికెల్​ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం కలవరపాటుకు గురి చేస్తోంది.

టీఎస్ఈ-పాస్​ ఇస్తున్న అనుమతులతోనే ఫ్యాక్టరీలు స్థాపిస్తున్నామని యాజమాన్యాలు చెబుతుండగా, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రం వాళ్ల మెప్పుపొందేందుకు గ్రామాల్లో ఫ్యాక్టరీలు పెట్టొదని అధికార పార్టీ లీడర్లు ఆదేశాలిస్తున్నారు. ఫ్లోరైడ్​ప్రభావిత ప్రాంతమైన మునుగోడు, గిరిజన ప్రాంతమైన మిర్యాలగూడ నియోజకవర్గం దామచర్ల మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఫార్మా, రసాయనిక పరిశ్రమల పనులు వేగంగా జరుగుతుండడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  

మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో...

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కృష్ణా, -మూసీనదీ పరివాహక ప్రాంతాలను ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో కొత్త ఫార్మా కంపెనీల స్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా చౌటుప్పుల్, సంస్థాన్​నారాయణ్​పూర్​మండలాల వరకే ఫార్మా కంపెనీలు విస్తరించగా, తాజాగా మునుగోడుతో పాటు కొత్తగా ఏర్పడ్డ గట్టుప్పుల్​మండలాల వైపు రూటు మార్చాయి. డిండి లిఫ్ట్​ఇరిగేషన్​స్కీంలో భాగంగా మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో చేపట్టిన రిజర్వాయర్లు పూర్తయితే కృష్ణా జలాలకు ఢోకా ఉండదని, ఫ్లోరైడ్​ నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడి ప్రజలు ఆశగా ఉన్నారు.

అదే విధంగా మూసీ కాలుష్యం నుంచి బయటపడి వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం భారీ చెక్​ డ్యాంలు కట్టేందుకు ప్లాన్​చేస్తోంది. ఈ చెక్​డ్యాంలకు సంబంధించి తెలంగాణ రిటైర్డ్​ఇంజినీర్ల ఫోరం డీపీఆర్​లు (డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​) సైతం సిద్ధం చేసింది. ఒకవైపు ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు అదే గట్టుప్పుల్, మునుగోడు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు సర్కార్​అనుమతులివ్వడం ఆందోళన కలిగిస్తోంది. గట్టుప్పుల్​శివారులో సన్​లైట్​ఫార్మా కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల పక్కనే ఉన్న వాగులు కలుషితమవుతాయని, భవిష్యత్తులో కృష్ణా జలాలు తాగే పరిస్థితి ఉండదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రధానంగా తాము సాగు చేసే పత్తి పంట నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంటుందని రైతులు భయపడుతున్నారు. చౌటుప్పుల్ మండలం మీదుగా ప్రవహించే మూసీ నది మునుగోడు, కనగల్​మండలాల మీదుగా హాలియా వాగులో కలుస్తుంది. ఈ నది ప్రవాహంపైనే ఆధారపడి మునుగోడు రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు అదే మండలంలోని కిష్టాపురం శివారులో క్రాంతి లేబొరేటరీస్​కు చెందిన ఫార్మా కంపెనీ స్థాపన జరుగుతోంది. ఈ ఫ్యాక్టరీలు వద్దని ప్రజా సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలు రెండు నెలల నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

అధికార పార్టీ లీడర్ల అండతో...

అధికార పార్టీ లీడర్ల మద్దతుతో ప్రజాభిప్రాయాన్ని సంపాదించి ప్రజల జీవితాన్ని ఫార్మా కంపెనీలు ఫణంగా పెడుతున్నారని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. హైవేలపైన భూముల రేట్లు విపరీతంగా పెరగడం, నీటి వనరులు సరిపడా లేకపోవడంతో ఫార్మా కంపెనీలు, కెమికల్​ఇండ్రస్టీస్​ పల్లెల్లోకి ప్రవేశిస్తున్నాయి. పల్లెల్లో భూములు తక్కువ రేట్లకు దొరకడం, కృష్ణా, మూసీ నది ప్రవహిస్తున్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని అక్కడే పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు ఓనర్లు.. అధికార పార్టీ లీడర్ల సపోర్ట్​తీసుకుంటున్నారు.

మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్​..గట్టుప్పుల్​లో పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని కలెక్టర్​కు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడ పనులు ఆగపోవడంతో స్థానిక రూలింగ్​పార్టీ నేతలే నిరసనలకు దిగారు. గత సోమవారం గట్టుప్పుల్, వెల్మకన్నె, పుట్టపాక గ్రామాల అఖిలపక్ష నాయకులు, గట్టుప్పుల్​పరిరక్షణ కమిటీ కన్వీనర్​ఇడం కైలాసం, సర్పంచ్​రోజా ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దామరచర్ల మండలం ఇరిక్కిగూడెంలో ఫెర్రో అల్లాయిస్​ఇండ్రస్టీ వద్దని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసినప్పటికీ అధికార పార్టీ నేతల అండతో ప్రజాభిప్రాయాన్ని నెగ్గించుకుని లైన్​ క్లియర్​చేసుకున్నారు. ఈ కంపెనీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశ చూపెట్టి, కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు తలొగ్గిన లోకల్​ లీడర్లు పరిశ్రమల స్థాపనకు వత్తాసు పలుకుతున్నారని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు. 

నదిలోకి వ్యర్థాలు వదిలే అవకాశం  

మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో ఫెర్రోఅల్లాయిస్​పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. నార్కట్​పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారిపైనే ఈ మండలం విస్తరించి ఉంది. కృష్ణా నది అతిపెద్ద నీటి ప్రవాహం ఈ మండలాల్లోని గ్రామాల నుంచే దిగువ ప్రాంతాలకు వెళ్తోంది. దీంతో కృష్ణానదికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నారు. 

దామరచర్ల మండలం ఇరిక్కిగూడెం శివారులో సుమారు 70 ఎకరాల్లో రూ.720 కోట్లు పెట్టి ఫెర్రోఅల్లాయిస్​ స్టీల్ ఇండ్రస్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ కృష్ణా నదికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇదే దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్​పవర్​ ప్లాంట్​నిర్మాణం జరుగుతోంది. ఈ పవర్ ప్లాంట్​ ఆధారంగానే అనేక ఫార్మా కంపెనీలు దామచర్ల మండలంలో అడుగుపెట్టేందుకు సర్కార్ ​నుంచి పర్మిషన్లు పొందుతున్నాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నాయి. ఫార్మా, రసాయనిక పరిశ్రమల నీటి అవసరాల కోసం కృష్ణా నదిని వాడుకుంటున్నారని, కానీ అదే కంపెనీలు వెదజల్లే వ్యర్థాలు నదిలోకి వదిలిపెట్టే ప్రమాదం కూడా ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే కృష్ణా, మూసీ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రమాదంలో పడ్డట్లేనని హెచ్చరిస్తున్నారు.

కేటీఆర్​ చెప్పినా పనులు ఆపట్లే 

ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ను కలిసి కంపెనీ అనుమతులు రద్దు చేయాలని కోరగా ఆయన కలెక్టర్​కు ఆదేశాలు ఇచ్చిండు. కానీ టీఎస్ఈ పాస్ అనుమతులతో మళ్లీ పనులను ప్రారంభించింది. కంపెనీ నిర్మించే స్థలానికి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రాత్రిపూట రోడ్లు వేశారు. ఈ కంపెనీతో పంటలు దెబ్బ తింటాయి. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. పక్కనే ఉన్న వాగు కలుషితమవుతుంది.

- ఇడం కైలాశ్, ఫార్మా కంపెనీ వ్యతిరేక కమిటీ కన్వీనర్​

కృష్ణా నీళ్లు కలుషితమవుతాయి 

దామరచర్ల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నం. దీనివల్ల కృష్ణా నది ప్రమాదంలో పడుతుంది. యాదాద్రి థర్మల్​ పవర్​ప్లాంట్​తోపాటు, కొత్తగా ఇరిక్కిగూడెంలో ఫెర్రో ేఅల్లాయిస్​ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. వీటి నుంచి వచ్చే వ్యర్థాలు నదిలో కలిస్తే ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంది. కానీ, అధికార పార్టీ అండతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి కంపెనీలు నెలకొల్పుతున్నారు.  

- శంకర్​నాయక్​, కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు