కొత్త విద్యా విధానంతో… స్కిల్స్​ పెరుగుతయ్

ఒక దేశం భవిష్యత్తులో పవర్ ఫుల్ కంట్రీగా నిలబడాలంటే.. ఆ దేశ పౌరులకు అందించే ఎడ్యుకేషనే పునాది. ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దేశం అంత గొప్పగా ఎదుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. 2040 నాటికి దేశ విద్యా వ్యవస్థను ప్రపంచంలోనే ది బెస్ట్​గా నిలపాలన్న లక్ష్యంతో దీనిని రూపొందించింది. పాత విద్యా విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ కేబినెట్ మాజీ సెక్రటరీ టీఎస్ఆర్ సుబ్రమణియన్ కమిటీ నివేదిక ఆధారంగా కొత్త విధాన ముసాయిదా తయారైంది. ఇస్రో మాజీ చైర్మన్ కేఎస్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ విద్యా విధాన కమిటీ 2019లో డ్రాఫ్ట్ ను కేంద్రానికి అందించింది. ఈ ఏడాది జూలైలో జాతీయ విద్యా విధానం–2020ని కేంద్రం ఆమోదించింది. 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6,600 బ్లాగులు, 6,000 పట్టణ స్థానిక ప్రభుత్వాలు, 676 జిల్లాల నుంచి విస్తృతమైన సూచనలు, సలహాలను తీసుకొని రూపొందించిన ఒక సమగ్ర విద్యా విధానం ఇది.

పాత పాలసీలోని లోపాలను సరిదిద్దుతూ..

పాత విద్యా విధానంలో లోపాలను సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త పాలసీ లక్ష్యాల్లో ప్రధానమైనది.. స్టూడెంట్స్ లెర్నింగ్ కెపాసిటీని పెంచడం.  అలాగే 2025 నాటికి ప్రతి చిన్నారికి నాణ్యమైన ప్రైమరీ ఎడ్యుకేషన్, 2030 నాటికి 3 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న అందరికీ ఉచిత నిర్భంద విద్య అందించడం, డ్రాప్ ఔట్స్ లేకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడం, 2035 నాటికి హయ్యర్ ఎడ్యుకేషన్ లో గ్రాస్ అడ్మిషన్ రేషియో 50 శాతానికి పెంచడంతోపాటు స్కిల్ డెవలప్ మెంట్ లో మార్పులు వంటివి కొత్త విద్యా విధానం లక్ష్యాలు. ఇందుకోసం ప్రాథమిక విద్యలోనే బేస్ వేయాల్సిన అవసరం ఉంది.

అందుకే పాత విధానంలో ఉన్న 10+2 ప్లేస్ లో 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను చట్టబద్ధం చేస్తున్నారు. మొదటి ఐదేళ్ల (3–8ఏళ్ల వయసు)లో ప్రీ ప్రైమరీ, ఒకటి, రెండు క్లాసుల వరకు ఉంటాయి. దీనిని ఫౌండేషన్ లెవల్ ఎడ్యుకేషన్ గా కొత్త పాలసీలో పెట్టారు. ఆ తర్వాత ఐదేళ్లు ప్రిపరేటరీ లెవల్ (9–11ఏళ్ల వయసు)లో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉంటాయి. కొత్త విద్యా విధానం ప్రకారం కనీసం ఐదో తరగతి పూర్తయ్యే వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే చదువు చెప్పాలని నిబంధన ఉంది. 12–14 ఏళ్ల వయసు వరకు మిడిల్ స్కూల్ లో ఆరు, ఏడు, ఎనిమిది క్లాసులు, చివరి నాలుగు సంవత్సరాలు (15–18 ఏళ్ల వయసు) 9 నుంచి 12వ తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్ గా విభజించారు.

చదువు చెప్పే తీరులోనూ మార్పులు

పిల్లలకు థియరీతో పాటూ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమన్న విషయాన్ని కొత్త విద్యా విధానం గట్టిగా ప్రస్తావించింది. ఇందుకోసం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవల్ నుంచే టీచింగ్ విధానంలో అవసరమైన సూచనలు చేశారు. పిల్లలు స్కూల్ లో చేరిన మొదటి ఐదేళ్లలో ప్రీ ప్రైమరీతో పాటు ఒకటి, రెండు తరగతులలో అక్షరాలు, అంకెలు నేర్పడంతో పాటు రంగులు, ఆకారాలను గుర్తించడం అలవాటు చేస్తారు. ఆ తర్వాత మూడు నుంచి ఐదు తరగతుల్లో ఆటపాటల ద్వారా చదువు చెప్పాలి. టెక్స్ట్ బుక్స్ పరిచయం, చదవడం, రాయడం, మాట్లాడే నైపుణ్యంపై దృష్టి పెడతారు. ఆ తర్వాత 6,7,8 తరగతుల్లో వివిధ భాషలు, మ్యాథ్స్, సైన్స్ లాంటివి టీచ్ చేయడంతో పాటు వాటిని అర్థం చేసుకునేలా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. 9 నుండి 12వ తరగతి వరకు విద్యార్థి ఆయా పాఠ్యాంశాలపై మరింత ప్రత్యేకతలను అభ్యసించే విధంగా లోతైన అధ్యయనానికి అవకాశం ఉండేలా టెక్స్ట్ బుక్స్ డిజైన్ ఉండాలి.

అలాగే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వృత్తి విద్యలో ఇండియా చాలా వెనుకబడి ఉందని ప్రస్తావిస్తూ వృత్తివిద్యకు పెద్దపీట వేయాలని, 9వ తరగతిలోనే వృత్తి విద్యను ప్రారంభించాలని, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కనీసం ఏదో ఒక వృత్తి విద్యలో నిర్బంధంగా శిక్షణ పొందే విధంగా కరికులం డిజైన్ ఉండాలని కొత్త పాలసీ సూచించింది. ఈ స్థాయిలోనే విద్యార్థికి తన జీవిత లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. పాఠశాల విద్య పునాదిపైనే స్టూడెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సిలబస్ తగ్గింపు, పరీక్షల విధానంలో మార్పులు, డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్, సబ్జెక్ట్ ఎనాలిసిస్ లాంటి పద్ధతుల ద్వారా విద్యా బోధన జరగాలని కొత్త విధానం నిర్దేశించింది. ప్రస్తుతం బట్టీ కొట్టిస్తూ.. పరీక్షలంటేనే పిల్లలు భయపడుతున్నారు.. ఈ పరిస్థితి పోయేలా సిలబస్, టీచింగ్ ఉండాలని, దీనికి తగ్గట్టు కరికులం డిజైన్ చేయాలని సూచిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ తోపాటు ఆలోచన శక్తి పెంచేలా చదువులు ఉంటే స్టూడెంట్స్ బంగారు భవితకు బాటలు వేసినట్టే.

అభివృద్ధికి ఉన్నత విద్యే కీలకం

సుస్థిరమైన జీవనోపాధి కల్పించడం ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్ దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉన్నత విద్య మంచిగా ఉంటే నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు, మేధో పరమైన ఉత్సుకత, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, సేవాతత్పరత కలిగిన విద్యార్థులు దేశ అభివృద్ధికి అంకితమవుతారు. ఇందు కోసం ప్రస్తుతమున్న ఉన్నత విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించాలని, 800 విశ్వవిద్యాలయాలు, 40 వేల కాలేజీలను 2040 నాటికి విభిన్న తరహాల్లో వృత్తి విద్యను అందించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఉన్నత విద్యా సంస్థలలో మంచి పరిశోధనలు జరిగేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేయాలని కొత్త విద్యా విధానంలో నిర్ణయించారు.

టీచర్ ట్రైనింగ్ లో సంస్కరణలు

రాబోయే తరాల భవిష్యత్తును నిర్దేశించడంలో టీచర్ల పాత్ర కీలకం. దీనికి ప్రధాన ఆధారమైన ఉపాధ్యాయ విద్య దేశంలో దారుణంగా భ్రష్టుపట్టింది. 2012లో జస్టిస్ జె.ఎస్.వర్మ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఉపాధ్యాయ శిక్షణ అందిస్తున్న సంస్థల్లో సుమారు పది వేల సంస్థలు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు తేలింది. జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో పది లక్షల మంది పరీక్షలు రాస్తే పట్టుమని 5 వేల మంది కూడా ఎలిజిబులిటీ సాధించడం లేదంటే ఉపాధ్యాయ విద్య ఏ స్థాయిలో భ్రష్టుపట్టిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఉపాధ్యాయ విద్యలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రారంభించాలని కొత్త విద్యా విధానం ప్రతిపాదించింది. అంతేకాకుండా టీచర్స్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్, టీచర్స్ సర్వీస్ రూల్స్​ వంటి వాటిని మార్చాలని సూచించింది. పి. మధుసూదన్ రెడ్డి,అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం