
- ఈజీ కానున్న టెస్లా ఎంట్రీ
- కనీస పెట్టుబడి రూ.4,150 కోట్లు ఉండాలని అంచనా
న్యూఢిల్లీ: టెస్లా వంటి ఈవీ కంపెనీలను ఆకర్షించేందుకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని కేంద్రం రెడీ చేస్తోంది. దిగుమతి సుంకాలను ప్రస్తుతం ఉన్న 110 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని చూస్తోంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, తక్కువ సుంకాలు పడాలంటే గ్లోబల్ కంపెనీలు కనీసం రూ.4,150 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
కార్యకలాపాలు ప్రారంభించిన రెండో ఏడాదికే కంపెనీ టర్నోవర్ రూ.2,500 కోట్లు దాటాల్సి ఉంటుంది. కంపెనీలు తమకు ఇప్పటికే ఉన్న ప్లాంట్లలో అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, గతంలో పెట్టిన పెట్టుబడులు, ల్యాండ్, బిల్డింగ్ ఖర్చులను అర్హత పొందడానికి చేయవలసిన ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి మినహాయిస్తారు.
ఈవీ పాలసీలో ఇవి ఉండొచ్చు..
ఈ పాలసీ కింద అర్హత పొందిన కంపెనీ ఏడాదికి 8 వేల వరకు ప్రీమియం కార్లను (ధర రూ.30 లక్షల పైన ఉన్న కార్లు) తక్కువ ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించి దిగుమతి చేసుకోవచ్చు. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోపు అప్లయ్ చేసుకోవాలి. అలానే అర్హత పొందిన కంపెనీ మూడేళ్లలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ఈ కంపెనీల టర్నోవర్ రెండో ఏడాదికి రూ.2,500 కోట్లు, నాలుగో ఏడాదికి రూ.5 వేల కోట్లు, ఐదో ఏడాదికి రూ.7,500 కోట్లు దాటాలి. ఐదేళ్లపాటు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ఏడాది జులై– ఆగస్టు టైమ్‌లో ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని, ప్రీమియం కార్ల దిగుమతులు ఆ తర్వాత ఊపందుకుంటాయని ఎనలిస్టలు భావిస్తున్నారు.
కాగా, మొదట కార్లను దిగుమతి చేసుకొని, అమ్మడం మొదలు పెడతామని, ఆ తర్వాతనే ప్లాంట్ ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని టెస్లా చెబుతున్న విషయం తెలిసిందే. అలానే ఇండియా 100 శాతానికి పైగా టారిఫ్‌లు వేస్తోందని, తగ్గించాలని కూడా కోరుతోంది. కొత్త ఈవీ పాలసీ వస్తే టెస్లాకు మేలు జరుగుతుంది. ఈ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. కార్లను రూ.21–22 లక్షల ప్రైస్ రేంజ్‌లో అమ్మనుంది. ముంబై పోర్టు నుంచి కార్లను దిగుమతి చేసుకొని ముంబై, ఢిల్లీ, బెంగళూరులో అమ్మాలనే ప్లాన్‌లో ఉంది. హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ కూడా కొత్త ఈవీ పాలసీపై ఆసక్తి చూపిస్తున్నాయి.