ప్రభుత్వ చిత్తశుద్ధితోనే  గ్రామీణం బాగుపడుతుంది

తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జీవితాలు మారాలంటే, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ వేసి, వేతన నిర్ణయం చేసినట్లుగానే, గ్రామీణ కుటుంబాలకు కూడా ఒక ఆదాయ కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ సిఫారసులకు చట్టబద్ధత కల్పించాలి. వ్యవసాయ, గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భద్రత అంటే ఏమిటో నిర్వచించి, దాన్ని సమకూర్చడానికి విధాన నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు చేయాలి. గ్రామీణ ప్రజల కుటుంబాలకు ప్రభుత్వ రంగంలో విద్య ఉచితంగా అందించాలి. కామన్ స్కూల్ సిస్టమ్ వైపు రాష్ట్రం ప్రయాణం చేయాలి. పిల్లలకు స్కూళ్లలో పౌష్టిక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనం అందించాలి. తమిళనాడు తరహాలో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అందించడానికి బడ్జెట్ కేటాయింపులు చేయాలి.

ప్రభుత్వ రంగంలో రోగ నిర్ధారణ పరీక్షలు సహా ప్రజలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలి. బెల్టు షాపులను రద్దు చేసి,  మద్య నియంత్రణ ప్రారంభించి, పూర్తి నిషేధం చేయడం సహా అనారోగ్యానికి  కారణమయ్యే, అన్ని పరిస్థితులను మార్చడం ద్వారా, ప్రజల అకాల మరణాల కట్టడిపై దృష్టి సారించాలి. కొన్ని రాజకీయ పార్టీలు ఉచిత విద్య, వైద్యం గురించి హామీలు ఇస్తున్నాయి. కానీ ఇప్పటికే ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలను, ఆసుపత్రులను ఏమి చేస్తారు? వాటితో ఎలా వ్యవహరిస్తారు ? అనేది ఏ పార్టీ స్పష్టం చేయడం లేదు. అలాంటి స్పష్టత లేకుంటే ఆచరణలో ఈ హామీల అమలు అసాధ్యమే అవుతుంది. ఉచిత, విద్య, వైద్యం డిమాండ్ చేస్తున్న సంస్థలు కూడా ఈ విషయంపై లోతైన చర్చ సాగించి ఒక ప్రణాళికను పార్టీల ముందు ఉంచాలి. 

భూ వినియోగ విధానం

1973 భూ సంస్కరణల(గరిష్ట పరిమితి) చట్టం అమలు చేసి, సమగ్ర భూమి సర్వే చేసి, తరి, కుష్కీ భూములను వర్గీకరించి, చట్టం మార్గదర్శకాల ప్రకారం మిగులు భూములను తేల్చి ఆ భూములను భూమి లేని గ్రామీణ కుటుంబాలకు పంపిణీ చేయాలి. పేదల భూ పంపిణీకి అవసరమైన భూమి కోసం భూ గరిష్ట పరిమితిని తగ్గించడం, భూమి కొనుగోలు పథకం కింద భూమిలేని కుటుంబాలకు కొనుగోలు చేసి ఇవ్వడం జరగాలి. భూమి లేని ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం ఎకరం నుంచి ఐదు ఎకరాల సాగు భూమి అందించడానికి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అనుభవాలను బట్టి పై రెండు పద్ధతుల్లో ఏది ఆచరణ సాధ్యమో పార్టీలు  ఆలోచించాలి. భూమి లేని పేదలకు భూమి కొనుగోలు చేసి ఇవ్వడం సాధ్యం కాదని గత ఎనిమిదేండ్ల పాలనలో స్పష్టంగా అర్థమైంది. భూమి సమస్య నిజంగా పరిష్కారం కావాలంటే ముందుగా రాష్ట్రంలో భూ వినియోగ విధానం తయారీ కూడా తక్షణ అవసరంగా గుర్తించాలి. అలాగే వ్యవసాయేతరులు వ్యవసాయ భూములు కొనకుండా నిషేధం విధిస్తే తప్ప రాష్ట్ర సాగు భూముల పరాయీకరణ ఆగదు. స్థానిక గ్రామ ప్రజల చేతిలో  సొంత వ్యవసాయానికి భూమి మిగలదు. ఈ విషయమై రాజకీయ చిత్త శుద్ధి లేకుండా, సాధ్యాసాధ్యాల గురించి లోతైన చర్చ లేకుండా, ఆచరణాత్మక ప్రణాళిక లేకుండా రాజకీయ పార్టీలు, తాము గెలిస్తే పేదలకు భూ పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చే హామీలు భూమి లేని పేదలను మోసం చేయడానికి మాత్రమే అని గుర్తించాలి.  

మహిళా రైతులకు ప్రాధాన్యం

ఆదివాసీలకు అడవిపై వ్యక్తిగత, సాముదాయక హక్కులను గుర్తించడానికి 2006 అటవీ హక్కుల చట్టాన్ని ఆ చట్టం స్ఫూర్తితో అమలు చేయాలి. అటవీ ఉత్పత్తులకు ఏటా కనీస మద్దతు ధరలను ప్రకటించి జీసీసీ ద్వారా సేకరించాలి. డిజిటల్ కాటాలు, స్థానికంగా గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో శుభ్రమైన తాగు నీరు అందించడానికి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆదివాసీ ప్రాంతాల పిల్లల చదువుకు వారి స్థానిక భాషలోనూ, ఇంగ్లీష్​లోనూ విద్యా బోధనకు ఏర్పాట్లు చేయాలి.  గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల మహిళలను రైతులుగా గుర్తించాలి.  వ్యవసాయ శాఖ విస్తరణలో ,శిక్షణలలో వీరికి తగిన భాగస్వామ్యం కల్పించాలి.  వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖల పథకాల్లో కూడా మహిళా రైతులకు స్పష్టమైన వాటా ఇవ్వాలి. రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు జండర్ అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. మహిళా రైతుల, కూలీల శ్రమను తగ్గించేలా పనిముట్ల అభివృద్ధి జరగాలి. వాటిని రైతు, మహిళా సహకార సంఘాల ద్వారా అందుబాటులోకి తేవాలి. 

కౌలు రైతులకు సాగు భూమి..

సొంత భూమి అసలు లేకపోయినా లేదా సాగు చేయడానికి తగినంత లేకపోయినా, రైతులు భూమిని కౌలుకు తీసుకుంటారు. అలాంటి కౌలు రైతులను రైతులుగా గుర్తించాలి. 2011 భూ అధీకృత సాగు దారుల చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఈ బాధ్యత తీసుకుని పని చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడంలో భూ యజమానులకు ఉండే భయాలను చర్చల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా, విస్తృత ప్రచారం ద్వారా పోగొట్టాలి. గ్రామంలో స్వయంగా సాగు చేయని రైతుల సాగు భూమిని(పట్టా వారి పేరు మీదే ఉంటుంది) లాండ్ బ్యాంక్ గా ఉంచి, కేరళ తరహాలో గ్రామ పంచాయతీ మధ్యవర్తిగా ఉండి, భూమి యజమానుల పట్టా హక్కులకు భరోసా ఇచ్చి, భూమి లేని పేదలకు కౌలుకు భూమి ఇప్పించాలి. కౌలు ధరలపై నియంత్రణ ఉండాలి. కొందరు నిపుణులు సూచిస్తున్నట్లుగా స్థానిక భూమి రిజిస్టర్డ్ విలువ మొత్తాన్ని బ్యాంకులో సంవత్సరానికి  ఫిక్స్​డ్ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీని ఎకరా కౌలు ధరగా నిర్ణయించే పద్ధతిని పరిశీలించవచ్చు. కౌలు రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయం ఇవ్వాలి. భూ యజమానులకు, కౌలు రైతులకు రైతు బంధు సాయం ఇవ్వడం ఆచరణలో సాధ్యం కాదు. రాష్ట్ర బడ్జెట్ కూడా అందుకు సహకరించదు. దీనికి బదులు రైతు పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలకు అదనంగా బోనస్ చెల్లింపు రూపంలో, ఇవే నిధులతో, నిజమైన రైతులకు సాయం అందించవచ్చు. పంట రుణాలు ఇప్పించడానికి బ్యాంకులకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి. వడ్డీ లేని పంట రుణాలు ఇప్పించాలి.  కౌలు రైతులను జాయింట్ లయబిలిటీ గ్రూపులుగా ఏర్పరచి బ్యాంకు లోన్లు ఇప్పించాలి. పంట రుణాలకు ఇచ్చినట్లుగా వీటికి కూడా జీరో శాతం వడ్డీ  అమలు చేయాలి. ప్రభుత్వం పంటలను సేకరించిన సమయంలో కౌలు రైతుల పంటలను నేరుగా వారి పేరు మీదే సేకరించాలి. వారి అకౌంట్ లోనే డబ్బు జమ చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట పోయిన కౌలు రైతులకు నేరుగా వారి అకౌంట్ కే పరిహారం అందించాలి. 

వ్యవసాయ కూలీ  కుటుంబాల హక్కులు  

పంటల సాగులో కూలీల పాత్ర ఎనలేనిది. అలాంటి కూలీ కుటుంబాలకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ఉపాధిహామీ పథకం కింద 100 రోజుల పని తప్పకుండా కల్పించాలి. పని స్థలాల్లో రక్షణ, ప్రమాద బీమా, పనిలో నైపుణ్యం పెంచే శిక్షణలు, ఆరోగ్య సంరక్షణ, ఇంటి స్థలం, ఇల్లు, సామాజిక భద్రత, వృద్ధాప్య పెన్షన్ లాంటివి హక్కుగా ఆ కుటుంబాలకు అందించాలి. ఆయా కుటుంబాల పిల్లలు బాల కార్మికులుగా మారకుండా చదువుకునే అవకాశం కల్పించాలి. వలస కూలీల పిల్లలకు కూడా స్థానిక స్కూళ్లలో విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చేయాలి. కూలీ కుటుంబాల పిల్లల ఉన్నత విద్యకు, ముఖ్యంగా సాంకేతిక విద్యకు అవసరమైన పరికరాలు(కంప్యూటర్ లాంటివి) , ఇంటర్నెట్ సౌకర్యం ఉచితంగా అందించాలి.  పొలాలు, ఇతర పని స్థలాల్లో మహిళలకు భద్రత, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు తప్పకుండా అందించాలి. అప్పుడే గ్రామీణ తెలంగాణం బాగుంటుంది.

-  కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక