ప్రధాని మోడీ బహిరంగ సభ సక్సెస్‌‌తో శ్రేణుల్లో నూతనోత్సాహం

పార్టీకి బూస్ట్ ఇచ్చిన ఆర్ఎఫ్​సీఎల్ రీ ఓపెనింగ్​

గోదావరిఖని/ జ్యోతినగర్‌‌, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) ప్లాంట్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సభ గ్రాండ్​సక్సెస్ కావడంతో బీజేపీ క్యాడర్​లో నయా జోష్‌‌ నెలకొంది. రూ.6,338 కోట్లతో నిర్మించిన ఈ ప్లాంట్‌‌తో ఏటా 12.75 లక్షల మెట్రిక్‌‌ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా, ఇందులో సగం తెలంగాణకే కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఫ్యాక్టరీని పునరుద్ధరించిందని ఇక్కడి బీజేపీ శ్రేణులతోపాటు ప్రజల్లో నాటుకుపోయింది. 

వివిధ జిల్లాల నుంచి తరలిన నేతలు..

ప్రధాని సభకు పెద్దపల్లి, కరీంనగర్‌‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాని వేదిక వద్దకు వచ్చిన సమయంలో ‘మోడీ.. మోడీ’ అంటూ పెద్దపెట్టున రైతులు, పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. భారత్‌‌ మాతాకీ జై, వందేమాతరం, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జవాన్‌.. జై కిసాన్‌‌ అంటూ చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. 

పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం..

ప్రధాని మోడీ సభ విజయవంతం చేయడం కోసం పెద్దపల్లి మాజీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌ వెంకటస్వామి, ఇతర లీడర్లు రామగుండంలోనే ఉంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. కాగా సభా ప్రాంగణానికి వెళ్లేందుకు ఎన్టీపీసీలో రెండు గేట్ల ద్వారా అనుమతులిచ్చారు. బీ‒ టైప్‌‌ గేట్‌‌ నుంచి రైతులు, పార్టీ శ్రేణులు, ప్రజలు చేతుల్లో జెండాలను పట్టుకుని రెండు కిలోమీటర్ల దూరం గల సభా వేదిక వద్దకు తరలివస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజస్థాన్‌‌కు చెందిన 500 మంది తలకు పగిడీలను ధరించి సభకు హాజరై మోడీని స్వాగతిస్తూ నినాదాలు చేసి ఆహుతులను ఆకర్షించారు. 

భారీ భద్రత..

ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. నల్ల చొక్కాలు, నల్ల కర్చీప్‌‌లు ఉన్న వారిని సభ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సభకు సింగరేణి డైరెక్టర్‌‌ ఎస్‌‌.చంద్రశేఖర్‌‌, జీఎం కె.నారాయణ, ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌‌ కుమార్‌‌, హెచ్‌‌ఆర్‌‌ హెడ్‌‌ విజయలక్ష్మి, ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ సీఈఓ ఎకె జైన్‌‌, ఇతర ఆఫీసర్లు,  హాజరయ్యారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా నుంచి..

వెలుగు, నెట్​వర్క్​: రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో నిర్వహించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఉమ్మడి కరీనగర్​జిల్లావ్యాప్తంగా ప్రజలు, బీజేపీ లీడర్లు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. జగిత్యాల బీజేపీ నియోజకవర్గ లీడర్ ఎడమల శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది సభకు వెళ్లారు. వారిలో పట్టణాధ్యక్షుడు అనిల్ కుమార్, సారంగాపూర్ మండలాధ్యక్షుడు వరుణ్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జగదీశ్, మండలాధ్యక్షుడు వెంకటేష్, ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు మహేశ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఉమేశ్​ఉన్నారు. సిరిసిల్ల నుంచి పట్టణ ప్రెసిడెంట్ అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు సభకు వెళ్లారు. వారిలో కైలాస్, సాయి కృష్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు. కోరుట్ల నుంచి బీజేపీ నియోజవర్గ లీడర్లు నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేశ్,  కౌన్సిలర్లు సునీత, జయలక్ష్మి, అలేఖ్య, నరేశ్, రాజశేఖర్, శ్రీనివాస్ రావు, పాతర్ల నర్సయ్య, తిరుమల వాసు, వెంకటేశ్ ఉన్నారు. మెట్ పల్లి నుంచి బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బోడ్ల రమేశ్​ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్, సుఖేందర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా అధికార ప్రతినిధి నరేశ్ సభకు వెళ్లారు. ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్​చార్జి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు ప్రధాని సభకు వెళ్లారు.  ప్రధాని సభకు వెల్గటూర్, గొల్లపల్లి, బుగ్గారం, ధర్మపురి, పెగడపల్లి మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, ఎండీ బషీర్, చక్రపాణి, స్టేట్ స్వచ్ఛభారత్ కన్వీనర్ రాజేశ్, శ్రీధర్, రాంబాబు తదితరులు ఉన్నారు.