ఏప్రిల్ చివరి నాటికి రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం బీసీసీఐ.. భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆ జట్టులో భారత ఆల్‌రౌండర్, ప్రస్తుత ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు చోటివ్వకూడదని.. మాజీ ప్లేయర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి హార్దిక్ ప్రపంచ కప్‌కు ఎంపిక కావడం అసాధ్యమని, అతనికి ప్రత్యామ్నాయంగా శివమ్ దూబేను ఎంపిక చేయాలని సెలెక్టర్లకు సూచించాడు.
పాండ్యా.. భారత టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ప్రస్తుత ఐపీఎల్ 2024లో తరచుగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని తివారీ తెలిపాడు. హార్దిక్ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడని.. ఈ సీజన్‌లో అతని ఎకానమీ రేట్ 11కు పైగా ఉందంటూ ఎద్దేవా చేశాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వరల్డ్ కప్ కు ఎంపిక చేయరని హార్దిక్ భవిష్యత్ గురుంచి జోస్యం చెప్పాడు. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ శివమ్ దూబేను తీసుకోవాలని తివారీ పేర్కొన్నాడు.
సీఎస్‌కే తప్పు..!
హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా టీ20 ప్రరఞ్చ కప్ జట్టుకు ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉందని తివారీ తెలిపాడు. బ్యాటింగ్ లో మెరిపించినంత మాత్రాన చోటు దక్కదని అన్నాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాన్ని క్రీడా మంత్రి విమర్శించాడు. ఒకవేళ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్‌కే తప్పే అవుతుందని ఆరోపించాడు. సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటికైనా కళ్లు తెరిసి.. దూబేలో ఉన్న బౌలింగ్ నైపుణ్యాలను వాడుకోవాలని సూచించాడు.
మే 26న ఐపీఎల్ టోర్నీ ముగియనుండగా.. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.