బై పోల్ ​నేపథ్యంతో లిక్కర్​కు మస్తు గిరాకీ

  • 25 రోజుల్లోనే రూ. 35.68  కోట్లకు చేరిన సేల్స్
  • కిటకిటలాడుతున్న బెల్ట్​షాపులు, వైన్స్, బార్లు

నల్గొండ :  త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్​ దందా జోరుగా నడుస్తున్నది. వైన్స్​, బార్లు, బెల్ట్​ షాపులు కిటకిటలాడుతున్నాయి. తమ కేడర్​ను కాపాడుకునేందుకు, ఓటర్లను ప్రనన్నం చేసుకునేందుకు లీడర్లు దావత్​ల మీద దావత్​లు ఇస్తున్నారు. నలుగురైదుగురు కలిస్తే చాలు.. మందుతో  సిట్టింగ్​లు వేస్తున్నారు. రాజకీయ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. లీడర్లు గ్రామాల్లో పర్యటించే క్రమంలో కేడర్​కు, వెంట తిరిగే పబ్లిక్​కు మందు, విందుతో దావత్​లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు అంటే 25 రోజుల్లోనే మునుగోడు సెగ్మెంట్​లో లిక్కర్​ సేల్స్​ రూ. 35.68  కోట్లకు చేరాయి. 

లిక్కర్​ షాపులు, బార్లు కిటకిట...
దావత్​లు,  పైసల పంపకాల కారణంగా నియోజకవర్గంలోని లిక్కర్​ షాపులు, బార్లు కిటకిటలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా సెగ్మెంట్​లో కీలకమైన చండూరు, మునుగోడు, చౌటుప్పల్ మండల కేంద్రాలపై లీడర్లు ఎక్కువ ఫోకస్​ పెట్టారు. మిగిలిన మండలాలతో పోలిస్తే ఈ మూడు చోట్ల దావత్​లు జోరుగా నడుస్తున్నాయి. ఫలితంగా ఇక్కడి లిక్కర్​ షాపులు, బార్లు, హోటళ్లు, దాబాలు, లాడ్జీలు సిట్టింగ్​లతో కళకళలాడుతున్నాయి.  లిక్కర్​ సేల్స్​ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నెల 1 నుంచి 25 వరకు నియోజకవర్గంలో నాంపల్లి, చండూరు, రామ న్నపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, సంస్థాన్​నారాయాణపూర్ మండలాల్లోని వైన్ షాపులు, బార్లలో రికార్డు స్థాయిలో లిక్కర్​ అమ్మకాలు జరిగాయి. 25 రోజుల్లోనే రూ. 35.68 కోట్ల లిక్కర్​సేల్స్​ జరిగాయి. గతేడాది ఆగస్టు నెలలో 25 కోట్ల లిక్కర్​ సేల్స్​ మాత్రమే జరిగాయి.  ఉప ఎన్నిక నోటిఫికేషన్​ రిలీజ్​ అయితే మద్యం సేల్స్​ మరింత పెరిగే అవకాశం ఉంది.  

మందుతో మచ్చిక!..
బైపోల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు గానీ నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 2న కాంగ్రెస్​పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. గడిచిన 25 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేడర్ చేజారకుండా వారికి బంపర్​ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పైసలతో పాటు మందు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు పైసలు, మందు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.