వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి అమరులవీరులకు నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన అమరులకు సలాం చేశారు. వైఎస్సార్ పాదయాత్రలో పోడు భూముల సమస్యను కళ్ళారా చూశారాని, అందుకే ఆయన సీఎం అయ్యాక వెంటనే కోనేరు రంగారావు కమిటీ వేశారని గుర్తు చేశారు. సీఎంగా వైఎస్సార్ 3.30లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారన్న వైఎస్ షర్మి.. ఆయన బతికి ఉంటే మిగిలిన 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చేవారని చెప్పారు.
-వైఎస్సార్ మరణాంతరం అప్పుడున్న కాంగ్రెస్, తర్వాత సీఎం కేసీఅర్ ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ ఇచ్చినట్లు ఏ ఒక్క నాయకుడు పట్టాలు ఇవ్వలేదన్న ఆమె.. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే 6 నెలల్లో కుర్చీ వేసుకొని సమస్య పరిష్కరిస్తా అన్నారని... కానీ ఆ హామీ ఏమైంది అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా సీఎం కేసీఅర్ ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదని, ఆయన ఒక చేతకాని ముఖ్యమంత్రి, గిరిజన ద్రోహి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పొడుభూములకి పట్టాలు అడిగితే సీఎం కేసీఆర్ అమాయకులను జైళ్లో పెట్టారని షర్మిల ఆరోపించారు. గత 9 ఏళ్లుగా వేలాది కేసులు పెట్టారని, ఇంద్రవెల్లి ఘటన ఒక జలియన్ వాలా బాగ్ ను తలపించిందని ఆమె చెప్పారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ అమలు ఏమైంది అంటూ ఆమె నిలదీశారు. గిరిజనుల కోసం రాష్ట్ర బడ్జెట్ లో కనీసం ఒక శాతం కూడా నిధులు ఖర్చు చేయడం లేదన్న షర్మిల.. అధికారంలో వచ్చాక ఆదివాసీల అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.