నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా తిరిగి ఎన్నికైన 6 నెలల్లోపు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(PoK) భారతదేశంలో భాగమవుతుందని బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
పీవోకేని కాపాడుకోవడంలో పాకిస్థాన్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని యోగి అన్నారు. "పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కాపాడుకోవడం పాకిస్థాన్‌కు కష్టంగా మారింది. ప్రధాని మోడీని మూడోసారి ప్రధానిగా చేయనివ్వండి.. 6 నెలల్లో పీఓకే భారతదేశంలో భాగమవుతుంది. అలాంటి పనికి ధైర్యం కావాలి.." అని యూపీ ముఖ్యమంత్రి ర్యాలీలో మాట్లాడారు.
అలాగే, భారతదేశంలో భద్రతపై కూడా యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి భారతీయుడికి రక్షణ, ఉపాధి కల్పించడం తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. "భారతదేశంలోని గొప్ప వ్యక్తులను గౌరవించాలి. ప్రతి కుమార్తెకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రతి వ్యాపారవేత్తకు రక్షణ కల్పించాలి. ప్రతి యువకుడికి ఉపాధి కల్పించాలి.. " అని యోగి అన్నారు.
అంతకుముందు అసోం సీఎం హిమంత శర్మ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పిఎం మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్ (పిఒజెకె) భారతదేశంలోకి చేర్చబడుతుందని చెప్పారు.
కాగా, ఇటీవల పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యారు. గోధుమ పిండి ధరలు, పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో పారామిలటరీ రేంజర్లపై దాడి చేసిన నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
పాల్ఘర్ లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న మహారాష్ట్రలోని ఇతర 12 స్థానాలతో పాటు ఎన్నికలు జరగనున్నాయి. ఇది మహారాష్ట్రలో 2024 పార్లమెంట్ ఎన్నికల చివరి దశ.