ఖమ్మం ముంపునకు.. కారణమదేనా ?

ఖమ్మం ముంపునకు.. కారణమదేనా ?
  • ప్రకాశ్‌‌నగర్‌‌ చెక్‌‌డ్యామ్‌‌ వల్లే వరద వచ్చిందంటూ ప్రాథమిక రిపోర్ట్‌‌
  • 2021లో రూ.8 కోట్లతో ఎనిమిది ఫీట్ల ఎత్తుతో నిర్మాణం
  • వరద వెనక్కి తన్నుకొచ్చి కాలనీల్లో చేరుతున్నట్లు అంచనా
  • చెక్‌‌డ్యామ్‌‌ ఎత్తు ఐదు ఫీట్లు తొలగించాలని ఆఫీసర్ల ప్రపోజల్‌

ఖమ్మం, వెలుగు : రెండు వారాల కింద మున్నేరు వాగు ఉప్పొంగి ఖమ్మం నగరాన్ని ముంచేసింది. మున్నేరును ఆనుకొని ఖమ్మం నగరం, పాలేరు నియోజకవర్గాల్లోని 20 కాలనీలకు చెందిన సుమారు 9 వేల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. వరదల కారణంగా ఒక్కో ఫ్యామిలీకి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా నష్టం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఆకేరు పోటెత్తడం, చెరువుల కట్టలు తెగడంతో మున్నేరు రికార్డు స్థాయిలో 40 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో భారీ స్థాయిలో నష్టం జరిగింది. దీంతో అసలు వరదలకు అసలు కారణం ఏంటో తెలుసుకునే పనిలో ఆఫీసర్లు నిమగ్నం అయ్యారు. 

ప్రకాశ్‌‌ నగర్‌‌ చెక్‌‌డ్యామే కారణమని ప్రాథమిక అంచనా

వరదలకు సంబంధించిన కారణాలను అన్వేషించిన ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు ప్రాథమిక రిపోర్ట్‌‌ను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. రెండేండ్ల నుంచి మున్నేరు వరదకు, కాలనీలు మునగడానికి ప్రకాశ్‌‌నగర్‌‌ వద్ద నిర్మించిన చెక్‌‌డ్యామే ప్రధాన కారణమని రిపోర్ట్‌‌లో ప్రస్తావించినట్లు సమాచారం. వరదల నివారణలో భాగంగా చెక్‌‌డ్యామ్‌‌ ఎత్తు తగ్గించాలని సూచించినట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం కారణంగా ఇప్పటికే ప్రకాశ్‌‌నగర్‌‌ బ్రిడ్జి డ్యామేజీ కావడంతో ఆర్నెళ్ల పాటు రాకపోకలు నిలిపివేశారు. భవిష్యత్‌‌లో ఇదే తరహాలో వరద వస్తే ఆ ప్రభావం మిగిలిన బ్రిడ్జిలపైనా ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

చెక్‌‌డ్యామ్‌‌ నుంచి వెనక్కు తన్నుకొస్తున్న వరద

బీఆర్ఎస్‌‌ హయాంలో 2021లో సుమారు రూ.8 కోట్ల ఖర్చుతో ప్రకాశ్‌‌నగర్‌‌ చెక్‌‌ డ్యామ్‌‌ నిర్మించారు. 200 మీటర్ల పొడవు, 8 ఫీట్ల ఎత్తుతో ఈ నిర్మాణం చేపట్టారు. త్రీటౌన్‌‌ ఏరియాలో గ్రౌండ్‌‌ వాటర్‌‌ పెంచేందుకు ఈ చెక్‌‌డ్యామ్‌‌ ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే 2023లో మున్నేరుకు భారీ వరద వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 32.6 ఫీట్ల ఎత్తుతో వరద ప్రవహించడంతో కాలనీలు నీటమునిగాయి. నడుములోతు నీళ్లు రావడంతో సుమారు 2 వేల కుటుంబాలను రిలీఫ్‌‌ క్యాంప్‌‌లకు తరలించారు.

అయితే ప్రకాశ్‌‌నగర్‌‌ చెక్‌‌డ్యామ్‌‌ కారణంగా వరద వెనక్కు వచ్చి కాలనీల్లోకి చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో వరద కాలనీల్లోకి చేరకుండా రిటైనింగ్‌‌ వాల్‌‌ నిర్మించాలని నిర్ణయించారు. 17 కిలోమీటర్ల మేర 33 ఫీట్ల ఎత్తుతో రిటైనింగ్‌‌ వాల్‌‌ నిర్మాణానికి రూ. 650 కోట్లు మంజూరు చేశారు. టెండర్లు పూర్తయి ఆర్నెళ్ల కింద పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సారి వరద 40 ఫీట్ల ఎత్తుతో రావడం రిటైనింగ్‌‌ వాల్‌‌ ఉపయోగం ఏంటన్న చర్చ తెరపైకి వచ్చింది. వాల్‌‌ ఎత్తు పెంచితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌‌రెడ్డి కూడా ఇంజినీర్లు స్టడీ చేసిన తర్వాత రిటైనింగ్‌‌వాల్‌‌ ఎత్తు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


ఎత్తు తగ్గించాలని ప్రపోజల్స్‌‌

ఖమ్మంలో మున్నేరు వాగుపై మూడు బ్రిడ్జిలు ఉన్నాయి. కాల్వొడ్డు సమీపంలో వందేండ్ల కింద నిర్మించిన రాతి వంతెన ఉండగా, దానికి ఎగువన బైపాస్‌‌లో ఒక బ్రిడ్జి, దిగువన ప్రకాశనగర్‌‌ దగ్గర మరో బ్రిడ్జి నిర్మించారు. మున్నేరుకు వచ్చిన వరద ముందున్న రెండు బ్రిడ్జిలను తాకుకుంటూ వెళ్లగా, ప్రకాశనగర్‌‌లో మాత్రం బ్రిడ్జి పై రెండు ఫీట్ల ఎత్తులో ప్రవహించింది. మూడు బ్రిడ్జిలు ఒకే ఎత్తులో ఉండగా ప్రకాశనగర్‌‌ బ్రిడ్జిపైకి మాత్రమే వరద రావడానికి చెక్‌‌డ్యామ్‌‌ నిర్మాణమే కారణమని చెబుతున్నారు.

దానిని తొలగించకపోతే రిటైనింగ్‌‌ వాల్‌‌ కట్టిన తర్వాత బ్రిడ్జిపై ఇంకా ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చెక్‌‌డ్యామ్‌‌ ఎత్తులో ఐదు ఫీట్లు తొలగించాలని ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ ఇచ్చారు. మరోవైపు నగరంలోని వరద నీరు మున్నేరులో కలిసేలా రిటైనింగ్‌‌వాల్‌‌ డిజైన్‌‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.