
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
మ్యూనిచ్: అమెరికా మద్దతు లేకుంటే తమ దేశం మనుగడ సాగించడం చాలా కష్టమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. చర్చల ద్వారా శాంతి ఒప్పందానికి రష్యా ఒప్పుకుంటుందని తాము భావించడం లేదని, విరామ సమయంలో మరిన్ని దాడులకు ఆ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
రష్యా నుంచి యురోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు ముప్పు పొంచి ఉందని, ఈయూ సొంత సైనిక కూటమిని తయారు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సు అనంతరం ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. తాము యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని.. అదే సమయంలో నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మాత్రం అనుమతించేది లేదని ట్రంప్ ప్రకటించారు. వీటికి ప్రతిస్పందనగా జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌తో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము జీవించడం చాలా కష్టమని పేర్కొన్నారు.