- కాళేశ్వరం కమిషన్ ముందు ఒప్పుకున్న ఆఫీసర్లు
- రెండో బ్లాక్ డిజైన్లనే 2ఏకు వాడాల్సి వచ్చింది
- రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుఆదేశాల మేరకే చేశామని వెల్లడి
- డిజైన్లు ఉన్నట్లు అఫిడవిట్లో తప్పుడు సమాచారం.. కమిషన్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: సుందిళ్ల బ్యారేజీలో ఓ బ్లాక్‌ను డిజైన్లు లేకుండానే నిర్మించినట్టు తేలింది. ఓ పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్టు బ్లాకులను నిర్మించినట్టు వెల్లడైంది. ఓపెన్ కోర్టు విచారణలో భాగంగా మంగళవారం 16 మంది ఇంజనీరింగ్ అధికారులను కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నించింది. ఒక డిప్యూటీ సీఈ, ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈలు, నలుగురు డీఈఈలతో పాటు 8 మంది ఏఈఈలను ప్రశ్నించి.. వివరాలు రాబట్టింది. ఒక ఏఈఈ అఫిడవిట్లో ఒక రకంగా సమాచారమిచ్చి.. ఓపెన్ కోర్టులో ఇంకో రకంగా సమాధానం చెప్పారు.
Also Read:-ఖాళీ ప్లాట్లలో చెత్త తీయకపోతే .. ఓనర్లకు రూ.10 వేల ఫైన్
దీంతో ఆ అధికారిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రత్యేకంగా డిజైన్లు లేకుండానే సుందిళ్ల బ్యారేజీలోని 2ఏ బ్లాక్‌ను నిర్మించినట్టు సదరు అధికారి విచారణలో ఒప్పుకున్నారు. బ్లాక్ 2 డిజైన్లనే 2ఏ బ్లాక్‌కు వాడినట్టు వెల్లడించారు. అంతకు ముందు అఫిడవిట్లో మాత్రం డిజైన్లున్నట్లు తెలిపారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంపై కమిషన్ చైర్మన్ సీరియస్ అయ్యారు. కోర్టు ముందు ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్పడం తీవ్రమైన నేరమని, దీన్ని క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు ఆఫీసర్‌ను హెచ్చరించారు.
క్రమపద్ధతి లేకుండా బ్లాక్‌ల నిర్మాణం
సుందిళ్ల బ్యారేజీ బ్లాకులను క్రమపద్ధతిలో నిర్మించారా లేదా అని ఏఈఈని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. అయితే, ఆ అధికారి ఓసారి క్రమపద్ధతిలోనే నిర్మించారని, మరోసారి వేరే బ్లాక్ నిర్మించాక 2ఏ బ్లాక్‌ను నిర్మించారని చెప్పారు. ‘‘2ఏ బ్లాక్‌ను కట్టాక 3ఏ కట్టారా? లేదంటే.. ముందు మూడో బ్లాక్‌ను నిర్మించి ఆ తర్వాత 2ఏని కట్టారా?’’ అని కమిషన్ప్రశ్నించింది. ‘‘ఒకటి, మూడు బ్లాకుల మధ్య 2ఏ బ్లాక్ వచ్చిందా? లేదంటే మూడు, 2 బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ ఉందా?” అని ఆరా తీయగా.. ఓసారి 3, 2 బ్లాకుల మధ్య వచ్చిందని, మరోసారి 1, 2 బ్లాకుల తర్వాత ఉందని సదరు అధికారి వేర్వేరుగా సమాధానాలిచ్చారు. దీనిపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నేండ్లు ఫీల్డ్‌లో ఉండి కూడా ఏది ఎప్పుడు ఎలా నిర్మించారో తెలియదా? అంటూ మండిపడ్డారు. కాగా, ఆ తర్వాత వచ్చిన మరో ఈఈ స్థాయి అధికారి బ్లాక్ 2ను నిర్మించిన తర్వాతే 2ఏ బ్లాక్‌ను కట్టినట్లు కమిషన్‌కు చెప్పారు. అయితే, 2ఏ బ్లాక్‌కు డిజైన్లు లేకపోవడం వల్ల రెండో బ్లాక్ డిజైన్ల ఆధారంగానే నిర్మించాల్సి వచ్చిందని తెలిపారు. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే అలా చేయాల్సి వచ్చిందని ఆ ఆఫీసర్ వివరించారు.
బ్లాక్1 మినహా రిపేర్లు పూర్తి
సుందిళ్ల బ్యారేజీ వద్ద బ్లాక్1 మినహా మిగతా అన్ని బ్లాకుల్లోనూ రిపేర్లు పూర్తయ్యాయని మరో అధికారి కమిషన్‌కు వెల్లడించారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ నవయుగ అన్ని రిపేర్లను చేసిందా? అని కమిషన్ ప్రశ్నించగా.. చేస్తున్నదని బదులిచ్చారు. బ్యారేజీలో సీపేజీలను ఇప్పటికే కట్టడి చేశారని, సీసీ బ్లాకులను రీప్లేస్ చేశారని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన మధ్యంతర రిపోర్టు ప్రకారం రిపేర్లు జరుగుతున్నాయన్నారు. ఒక్క బ్లాక్ మినహా అన్నింట్లోనూ కొత్త సీసీ బ్లాకులను ఏర్పాటు చేశారని చెప్పారు.
మొన్నటి వరకు వర్షాల వల్ల ఆ ఒక్క బ్లాకు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, ప్రస్తుతం ఆ బ్లాకు గుండా కొంత మేర వరద ప్రవాహం వెళ్తుండడంతో రిపేర్లు చేయడం కుదరడం లేదని తెలిపారు. కాగా, అధికారుల దగ్గర్నుంచి ప్లేస్మెంట్ రిజిస్టర్లు, ఎరెక్షన్ బుక్స్, మెజర్మెంట్ బుక్స్‌ను కమిషన్ స్వాధీనం చేసుకుంది. ఒక్కో అధికారి దగ్గర 6 నుంచి 12 వరకు రికార్డులను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వాటిపై వాళ్ల సంతకాలను తీసుకున్నది.