దూరదృష్టి, చిత్తశుద్ధి లేకనే సిటీ ​ట్రాఫిక్​ ఆగమాగం : దొంతి నర్సింహారెడ్డి

హైదరాబాద్ నగర ప్రజా రవాణాపై పాలకులకు దూరదృష్టి, చిత్త శుద్ధి రెండూ లేవు. రోడ్లు, వంతెనల కోసం కోట్ల మేర ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. ప్రజా రవాణాను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రైవేటు వ్యక్తిగత వాహనాల పెంపునకు ఊతం ఇస్తున్నది. కోట్ల రూపాయలతో చేపట్టిన మెట్రో రైలుతో ట్రాఫిక్​తగ్గలేదు. పైగా మెట్రో టిక్కెట్​కూడా సామాన్యులకు అందుబాటులో లేదు. మరోవైపు ఆర్టీసీ బస్సులను తగ్గించింది. ఎంఎంటీఎస్ ​రైళ్ల రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నది. ఇలా ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్ల రోజు రోజుకూ కార్లు, బైకుల వంటి వ్యక్తిగత వాహనాలు ఎక్కువై, నగరంలో కాలుష్యం పెరుగుతున్నది. హైదరాబాద్​మరో ఢిల్లీ కాకముందే చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం తగ్గించడానికి జర్మనీ ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణం పూర్తిగా ఉచితం చేసింది. అంటే, ప్రభుత్వమే ప్రజా రవాణాకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో చెల్లిస్తున్నది. ఇండోర్ సిటీలో బస్సులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. బస్సులు నిరంతరాయంగా ఆ మార్గంలో తిరుగుతుంటాయి. ప్రయాణం తొందరగా అవుతుంది, బస్సులకు ఇంధనం, రిపేర్ల ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. దాని వల్ల టికెట్ రేట్లు కూడా అక్కడ తక్కువే. కానీ హైదరాబాద్​ నగరంలో ఇలాంటి చర్యలేమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మందికి ఉపయోగపడే ప్రజా రవాణా వ్యవస్థలకు అవసరమైన విధానాలు, నిధులు, మౌలిక వసతులు కల్పించడం లేదు.  హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం యూనిఫైడ్​ మెట్రోపాలిటన్​ట్రాన్స్​పోర్ట్​అథారిటీ(యూఎంటీఏ) ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ సంస్థ ఆశించిన ఫలితాలు రావడం లేదు. రోడ్ల విస్తరణ, బిల్డింగ్ అనుమతులు, అభివృద్ధి పనులు, వాణిజ్య సముదాయాల ఏర్పాటులో ఇంకా సమన్వయ లోపం కనిపిస్తున్నది. 

ట్రాఫిక్ ​తగ్గించని మెట్రో రైలు 

హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సమస్య, రవాణా మీద దృష్టి పెట్టకపోవడం వల్ల సమస్య జటిలం అవుతున్నది. ఒక అధ్యయనం ప్రకారం రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి దాదాపు రూ.1,75,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుందని అంచనా. హైదరాబాద్ లో నగర రవాణాకు మెట్రో రైలు లేదా అట్లాంటి ‘పెట్టుబడి’ పరిష్కారంగా కొందరు భావిస్తున్నారు. మెట్రో రైలు కనీస టికెట్ ధర ఇప్పటికే రూ.8 నుంచి రూ.18 అయింది. ఈ ధర సామాన్యులకు అందుబాటులో లేదు. అందుకే మెట్రో రైలు వాడే నగరవాసుల సంఖ్య పరిమితంగానే ఉంటున్నది. గత కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య బాగా తగ్గినందున.. బయట ఉబ్బరం, ట్రాఫిక్ రద్దీలో బస్సులు తొందరగా వెళ్లలేని పరిస్థితుల్లో మెట్రో రైలు ఎక్కేవారి సంఖ్య కాస్త పెరిగింది. అయితే, ఎంత ఆదరణ పెరిగినా, మెట్రో రైలు స్తోమతలో పరిమితులున్నాయి. మెట్రోలో రోజుకు 3.5 లక్షల మంది కంటే ఎక్కువ ప్రయాణం చేయలేరు. పరిమితి దాటి ఎక్కువ రైళ్లు వేయలేరు. వేగం మీద పరిమితి ఉంది. ఒక్కో రైలుకు డబ్బాలు కూడా ఎక్కువ చేయలేరు. కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం. మెట్రో రైలు నిర్మాణానికి ముందు చేసిన ఒక అధ్యయనం ప్రకారం రోజు కూకట్​పల్లి నుంచి చార్మినార్ మధ్య 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దాని వల్ల ప్రస్తుత రవాణా రద్దీని తగ్గించే సామర్థ్యం మెట్రో రైలుకు లేదు. ఉన్నా అది పది శాతం మించకపోవచ్చు. ఈ పాటి పరిష్కారానికి దాదాపు రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం, అసలే తక్కువ నిడివితో ఉన్న ప్రధాన రోడ్డు మార్గాల్లో ఎక్కువ జాగా కేటాయించడం వల్ల ఇతర రవాణా పరిష్కారాలకు తావు లేని పరిస్థితి ఏర్పడింది. 

కోటిన్నర జనాభాకు1,800 బస్సులకు మించి లేవు

ఒకప్పటి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన ఆర్టీసీ బస్సులే కనపడేవి. నిజాం కాలంలోనే హైదరాబాద్​లో బస్సు సౌకర్యం ఏర్పాటు అయింది. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత బస్సుల మీద ప్రభుత్వానికి శ్రద్ధ తగ్గింది. 50 లక్షల జనాభా ఉన్నప్పుడు దాదాపు3,500 బస్సులు ఉంటే, ఇప్పుడు కోటిన్నర జనాభాకు1,800 బస్సులకు మించి లేవు. ఉన్నవి కూడా పాతవి. కొత్త బస్సులు కొనడం లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆర్టీసీ బాగా నష్టపోయింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ నష్టం పూడ్చి కార్పొరేషన్ కు జవసత్వాలు అందించాల్సిన ప్రభుత్వం.. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. బస్సులు లేకపోవడంతో రోజూ నగరంలోకి వచ్చే విద్యార్థులు, చిరు వ్యాపారులు, రైతులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరం వెలుపల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు ఉన్న కొన్ని బస్సుల్లోనే ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. ఆడపిల్లల అవస్థలు వర్ణనాతీతం. వృద్ధులు తమ ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. బస్సుల సంఖ్యను కనీసం 6 వేలకు పెంచి, ప్రజలను బస్సుల వైపు మళ్లించే యోచన చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ, రోడ్ల మీద పెట్టుబడి పెడుతున్నది. పరోక్షంగా ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తూ.. ట్రాఫిక్, కాలుష్యాన్ని పెంచుతున్నది. సర్కారు అలసత్వంతోనే రవాణా సమస్య రావణ కాష్టంలా రగులుతున్నది. 

ఎంఎంటీఎస్ పైనా నిర్లక్ష్యం

ప్రజా రవాణా వ్యవస్థ పరంగా హైదరాబాద్​నగరానికి ఉన్న వరం ఎంఎంటీఎస్​రైలు వ్యవస్థ. దాన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఎంఎంటీఎస్​ద్వారా ఉప్పుగూడ నుంచి లింగంపల్లి వరకు అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌకర్యం ఉన్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగిపోయిన ఈ సర్వీసులను, మళ్లీ మొదలుపెట్టినా దానిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. లాక్ డౌన్ ముగిసి ఏడాది దాటినా సేవలు ప్రారంభం కాలేదు. కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటే అప్పుడు మొదలు పెట్టారు. ఎంఎంటీఎస్​సెకండ్​ఫేజ్ ఎప్పుడో మొదలుపెట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక ఇప్పటికీ అది పెండింగ్​లోనే ఉంది.  ఎంఎంటీఎస్​ రైళ్లు, బస్సులు ఉంటే ప్రజలు శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని తమ జీవనోపాధి కోసం నగరానికి వచ్చే వీలు ఉంటుంది. ఇప్పుడు పేదలు, మధ్య తరగతి ప్రజలు రవాణా ఖర్చులు భరించలేక, ఇటు నగరంలో ఇండ్ల కిరాయిలు కట్టలేక, సొంత ఇల్లు కొనుక్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఈ వర్గం ఇబ్బందుల పట్ల సోయి లేదు.

సరైన అధ్యయనం జరగాలి..

హైదరాబాద్ నగర సంస్థలు జీవనోపాధుల మీద అధ్యయనం చేసి, ఆ మేరకు రవాణా వ్యవస్థను మెరుగు చేయాలి. ఎంఎంటీఎస్, బస్సులు, షేర్ ఆటోలు, మెట్రో రైలు వంటి రవాణా మార్గాలను అనుసంధానం చేయాలి. ప్రభుత్వం మౌలిక సదుపాయాల మీద పెట్టుబడి పెడితే, ప్రజల నుంచి వచ్చే టికెట్ సొమ్ముతో వాటిని నిర్వహించడం సులభం అవుతుంది. ఇంధన వినియోగంలోనూ మార్పులు తీసుకు రావాలి. విద్యుత్ వాహనాలను విరివిగా వాడాలి. వికేంద్రీకృత నగర అభివృద్ధి వల్ల నగర రవాణా సులభం, సురక్షితం. ఖర్చు, కాలుష్యం కూడా తగ్గుతాయి. ప్రైవేటు రవాణాకు, అందులోనూ కార్లకు, ప్రాధాన్యం తగ్గించి, బస్సు, రైలు వ్యవస్థలను సామాన్యుడికి చేరువ చేయాలి. అప్పుడే హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ బాగుపడుతుంది. నగరంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. హైదరాబాద్ మాస్టర్ ప్లానులో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా నిబంధనల రూపకల్పన జరగాలి. నివాస ప్రాంతాల్లో సైకిళ్ల ఉపయోగం పెంచే విధంగా సదుపాయాల అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే భూమి విలువ పెంపు, వంతెనలు కట్టి, లైట్లు వేసుకుని, ఫొటోలు తీసుకొని మురిసిపోవడమే కాదు. అందరు సంతోషంగా జీవించ గలగడం చాలా ముఖ్యం.

- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్