చైనా దాస్తున్ననిజాలివే…

చైనా అనగానే సోషలిజంతో జనం అందరూ సంతోషంగా ఉన్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద దేశంగా అందరం చైనా గురించి గొప్పగా చెప్పుకుంటాం. అనేక రంగాల్లో చైనా సాధించిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతాం. అయితే బయటి ప్రపంచానికి ఏం చూపించాలను కుంటుందో దాన్నే ఆ దేశం చూపిస్తోంది. బయటి ప్రపంచానికి తెలిసిన చైనా ఒకలా ఉంటే అసలు ఆ దేశంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. తమ దేశానికి సంబంధించినవి కొన్నింటిని బయటకు రాకుండా చైనా జాగ్రత్తపడుతోంది.

ప్రపంచంలోనే  రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా గొప్పలు చెప్పుకునే చైనాలో ఓ రేంజ్​ లో పేదరికం ఉంది. దేశవ్యాప్తంగా 8.2 కోట్ల మంది పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారని సాక్షాత్తూ 2018 లెక్కలు తేల్చి చెబుతున్నాయి. సింపుల్​గా చెప్పాలంటే అక్కడ జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరు పేదనే. పల్లెల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని కుటుంబాలు తిండికి కూడా కటకటలాడే పరిస్థితులున్నాయి.ఇక్కడి భూములు కూడా పెద్దగా వ్యవసాయానికి పనికిరావు. సగం భూములు ఎడారిని గుర్తుకు తెస్తుంటాయి. పల్లెల్లో బతికేవారికి వ్యవసాయం తప్ప మరో పని రాదు. తెలియదు కూడా. దీంతో పల్లెల్లో ప్రజలు ఎంతగా కష్టపడ్డా తినడానికి బొటాబొటీ ధాన్యం మాత్రమే పండుతుంది. ఇళ్లల్లో కూడా పేదరికం బాగా కనిపిస్తుంది. ఎక్కువగా కొండలకు ఆనుకుని ఇళ్లు కట్టుకుంటారు. పిల్లలు చదువుకునే స్కూళ్ల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. కనీస సదుపాయాలుండవు. క్వాలిఫైడ్ టీచర్లు ఉండవు. చైనాలో తొలిసారి 1970లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2002 వరకు ఈ సంస్కరణలు కొనసాగాయి. అయితే వీటి ఫలితంగా పట్టణాలు, నగరాలు మాత్రం డెవలప్ అయ్యాయే కానీ పల్లెల్లో అభివృద్ది లేదంటున్నారు సోషల్ సైంటిస్టులు.

ఎయిర్ పాల్యూషన్​తో ఇబ్బందులు

చైనాలో ఉన్నంత ఎయిర్ పొల్యూషన్ ప్రపంచంలో మరో దేశంలో ఎక్కడా లేదు. చైనాలో సోలార్ పవర్ పై ఆధారపడి నడిచే పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. కొన్ని సార్లు అసలు సూర్యుడి నుంచి వచ్చే కాంతి, సోలార్ ప్యానెల్స్ కు చేరుకోకుండా ఎయిర్ పొల్యూషన్ అడ్డుపడుతోంది. ఇక్కడ బొగ్గుపై నడిచే పరిశ్రమలు ఎక్కువ. దేశ ఆర్థిక వ్యవస్థకు కోల్ సెక్టారే కీలకం. కోల్ సెక్టార్ వల్ల ఎకానమీకి ఎంత లాభం జరిగిందన్న సంగతి పక్కనపెడితే ఎయిర్ పొల్యూషన్ మాత్రం చాలా పెరిగింది.

నీటి కాలుష్యం

చైనాలో గాలి కలుషితం కావడమే కాదు నీటి కాలుష్యం కూడా ఎక్కువే. ఎక్కడో మారుమూల పల్లెలో కాదు పట్టణాలు, నగరాల్లో కూడా తాగడానికి కలుషితమైన నీరే దిక్కవుతోంది. ప్రధాన నగరమైన షాంఘై ద్వారా ప్రవహించే మేజర్ నదులన్నీ దాదాపు 85 శాతం కలుషితమయ్యాయని 2015 నాటి ‘న్యూ వాటర్ క్వాలిటీ రిపోర్ట్’ స్పష్టం చేసింది. తాగే నీళ్లు ఇంతగా పొల్యూట్ కావడానికి ప్రధాన కారణం స్థానిక ప్రభుత్వాల ఫెయిల్యూరే అంటున్నారు సోషల్ సైంటిస్టులు. చాలా పట్టణాల్లో డ్రైనేజ్ సిస్టమ్  నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. దీంతోజనాభాలో సగం మంది ప్రజలు వేరే మార్గం లేక కలుషితమైన నీటినే తాగుతుంటారని  లెక్కలు చెబుతున్నాయి.

లోపాలతో పుడుతున్న చిన్నారులు

చైనా పిల్లలకు పుట్టుకతోనే అనేక లోపాలుంటున్నాయి. ఇరవై ఏళ్ల నుంచి ఇలాంటి పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఏడాదికి కోటిన్నర మంది చిన్నారులు ఇలా లోపాలతో పుడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చైనా ప్రజల లైఫ్ స్టయిల్​లో విపరీతమైన మార్పులు వచ్చాయి. పట్టణాలు,నగరాల్లోనే  కాదు మారుమూల పల్లెల్లో నివసించే ప్రజల లైఫ్ స్టయిల్ మారిపోయింది. ఫుడ్ హేబిట్స్ మారిపోయాయి. జంక్ ఫుడ్ కు ప్రజలు అలవాటు పడ్డారు.

ఎక్కువ మరణశిక్షలు ఇక్కడే..

ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షలు తగ్గినా చైనాలో మాత్రం తగ్గే ముచ్చటే కనిపించడం లేదు. మిగతా దేశాల్లో అమలయ్యే  మరణశిక్షలకు నాలుగింతలు ఒక్క చైనాలోనే అమలవుతున్నాయి. 2017లో అయితే వేలల్లో మరణశిక్షలు  అమలయ్యాయని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ సంస్థ పేర్కొంది. అయితే ఈ విషయాన్ని  బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చైనా ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ఆరోపించింది. న్యాయవ్యవస్థలో సంస్కరణవాదం తెరమీదకు రావడంతో చాలా దేశాలు అసలు మరణశిక్షలకు గుడ్ బై కొట్టాయి. తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లకు కూడా యావజ్జీవ ఖైదు విధిస్తున్నారు. ఆఫ్రికాలో అయితే ఒక్క సోమాలియా, సౌత్ సూడాన్ మినహా మిగతా అన్ని దేశాలు అసలు కేపిటల్ పనిష్మెంట్ ను నిషేధించాయి. ఒకవైపు బయటి ప్రపంచం ఇలా ఉంటే చైనాలో మాత్రం మరణశిక్షలు ఏమాత్రం తగ్గడం లేదు. కొన్నిసార్లు కిందటేడాదితో పోలిస్తే పెరిగిన దాఖలాలు కూడా కనపిస్తున్నాయి. డ్రగ్స్ కేసుల్లో కూడా  కేపిటల్ పనిష్మెంట్ ఇస్తోంది ఇక్కడి న్యాయ వ్యవస్థ.

గోబి ఎడారి పెరుగుతోంది

గోబి ఎడారి కొన్నేళ్లుగా చైనా వైపున విపరీతమైన స్పీడుతో విస్తరిస్తోంది. దీంతో  ఏడాదికి 2,250 మైళ్ల విస్తీర్ణంలో ఉన్న గడ్డి భూములు ఎడారిగా మారుతున్నాయి. అడవుల నరికివేత, నీటి కొరత, వాతావరణంలో వస్తున్న రకరకాల మార్పులే దీనికి కారణమంటున్నారు నిపుణులు. దీని  ప్రభావం చివరకు చైనా ఆర్థిక వ్యవస్థ పై పడుతోంది.  గోబి ఎడారి విస్తరణను అడ్డుకోవడానికి  ‘గ్రేట్ గ్రీన్ వాల్’ పేరుతో  ఒక పెద్ద పథకాన్ని  చేపట్టింది చైనా ప్రభుత్వం. ఎడారి విస్తరించే దారి పొడవునా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నది చైనా ఉద్దేశం.

సోషల్ మీడియాపై తరచు ఆంక్షలు

ఇంటర్నెట్​పై చైనా ఉక్కుపాదం మోపింది. వాటిపై తరచు ఆంక్షలు విధించడం, బ్యాన్​ చేయడం జరుగుతోంది. ‘ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్’ అనేది చైనాలో  లేదంటారు సోషల్ సైంటిస్టులు. దాదాపు 3,000 సైట్లను సర్కార్ బ్లాక్ చేసింది. వెబ్ సైట్లలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చాలా మందిని అరెస్టు చేసింది.

పెరుగుతున్న  మతధోరణి

చైనా, కమ్యూనిస్టు దేశం కాబట్టి అక్కడ మతానికి చోటు లేదనుకుంటాం. కానీ అక్కడి పరిస్థితులు డిఫరెంట్​గా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలో మెంబర్లుగా ఉన్న వాళ్లు సహజంగా మతపరమైన అంశాలకు దూరంగా ఉంటారు. సామాన్య ప్రజలపై ఇలాంటి ఆంక్షలు ఏమీ ఉండవు. కొన్నేళ్లుగా చైనాలో మతధోరణి బాగా పెరుగుతోంది.

రీ సైక్లింగ్  పరిశ్రమలు ఎక్కువ

చైనాలో రీ సైక్లింగ్ పరిశ్రమలు బాగా ఎక్కువ. ఎయిర్ పొల్యూషన్ కు ఇవే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. దాదాపు ప్రతి పట్టణంలోనూ రీ సైక్లింగ్ పరిశ్రమలు ఉంటాయి. చైనాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి బతుకుదెరువు ఇస్తోంది రీ సైక్లింగ్ పరిశ్రమలే. చెత్త కుండీ నుంచి కూల్ డ్రింక్ సీసాలు, మూతలు వంటివి తీసి వాటిని ఎక్కువగా రీ సైక్లింగ్ చేస్తుంటారు. రీ సైక్లింగ్ పరిశ్రమలు పెట్టుకోవడం చైనాలో చాలా ఈజీ. ఇంటి నాలుగ్గోడల మధ్య కుటుంబ సభ్యులే ఈ పరిశ్రమను నడుపుకోవచ్చు. వీటికి లైసెన్సులు తీసుకోకపోయినా అధికారులు ఎవరూ పట్టించుకోరు. వీటి వల్ల కాలుష్యం చాలా పెరిగిపోతోంది.

కొనుగోలు శక్తి తక్కువే

ప్రపంచంలోనే అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్​గా  చైనా కు ఎంతో పేరుంది. అంతేకాదు కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారని బయటి దేశాల్లో ప్రచారం ఉంది. అయితే అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్​ గా చైనా కు ఎంత పేరున్నా  అదే నిష్పత్తిలో ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు. చాలా పేరున్న మాల్స్ కూడా కస్టమర్లు లేకపోవడంతో వెలవెలపోతుంటాయి. తిండికి సంబంధించిన కేఎఫ్ సీ, మాక్ డొనాల్డ్ వంటి కొన్ని మాల్స్ లో మాత్రమే కాస్తంత జనం కనిపిస్తుంటారు. ఈ రెస్టారెంట్లకే ప్రజలు వస్తుంటారు. డబ్బులు ఖర్చు పెడుతుంటారు. దీనికి కారణం ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగకపోవడమే అంటున్నారు. బొటాబొటీ రాబడి మాత్రమే ఉండడంతో అనవసరపు ఖర్చులకు చైనా ప్రజలు వెళ్లరంటున్నారు ఎనలిస్టులు. మరీ అవసరమైతే  డ్రస్సులకు, తిండికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారట.

జనమే లేని ఘోస్ట్ సిటీలు

జనాభా అంచనాలను పట్టించుకోకుండా చాలా స్పీడుగా నగరాలను నిర్మించి ప్రస్తుతం ఇబ్బందులు పడుతోంది చైనా దేశం. ఎక్కడైనా  జనాభా డిమాండుకు తగ్గట్టు నగరాలను నిర్మిస్తారు. అయితే ఈ విషయంలో చైనా తొందరపడిందం టున్నారు నిపుణులు. దీంతో మొత్తం ప్రాజెక్టే డేంజర్ లో పడింది. న్యూ సౌత్ చైనా మాల్ ను దాదాపు పదేళ్ల కిందట మొక్కజొన్న పొలాల్లో నిర్మించింది సర్కార్. అయితే ఇప్పటికీ ఆ సిటీ 99 శాతం ఖాళీగానే ఉంది. యాందు చెంగ్ సిటీలో కూడా జనమే లేరు. ఇంటి కిరాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ నగరాల్లోకి ప్రజలు రాకపోవడానికి ఒక కారణమంటున్నారు.

నెక్ట్స్  లామా ఎవరో తేల్చేది సర్కారే 

దలైలామా ప్రభావాన్ని తగ్గించడానికి  ప్రభుత్వమే లామాలను నియమించే పని నెత్తిన వేసుకుంది.  చైనాలో బుద్ధిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దలైలామాను బుద్ధుడి మరో రూపంగా బుద్ధిస్టులు భావిస్తుంటారు. దీంతో  దలైలామా ప్రభావాన్ని తగ్గించాలని చైనా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా తదుపరి (15వ) లామా ఎవరన్న నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉందని చైనా భావిస్తోంది. అయితే దీనిని చాలా మంది బుద్ధిస్టులు ఒప్పుకోవడం లేదు. చైనా వందలాదిగా లామాలను ప్రకటించడం మొదలెట్టింది. వాళ్లలో చాలా మంది పదేళ్లలోపు పిల్లలు కూడా ఉంటున్నారు. ఆధ్యాత్మిక అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని అంటున్నా వినడం లేదు.

డ్వార్ఫ్ థీమ్ పార్క్

టూరిజం పై రాబడి  కోసం చైనా ఎంతకైనా తెగిస్తోందన్న విమర్శలున్నాయి.    ప్రపంచ దేశాల్లో చైనాకు టూరిజం హబ్​ గా పేరుంది. ఇక్కడి వింతలు విశేషాలు చూడటానికి అనేక దేశాల నుంచి ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. దీంతో టూరిజాన్ని  డెవలప్ చేసుకోవాలని చైనా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బాగా పొట్టిగా ఉండేవారిని చూపించి టూరిస్టులను ఆకట్టుకోవడానికి కూడా వెనకాడటం లేదు. సౌత్ చైనాలోని ‘కున్మింగ్’ ప్రాంతంలో వీళ్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. పుట్టగొడుగు షేపుల్లో ఇళ్లు కట్టుకుని అందులో నివాసం ఉంటారు. దీంతో వీళ్లుండే  ప్రాంతాన్ని  ఒక థీమ్ పార్క్​ గా చైనా డెవలప్ చేసింది. ‘ఈ వింత ప్రపంచాన్ని చూడండి బాబూ ’ అంటూ టూరిస్టులను ఆహ్వానిస్తోంది. బయటి దేశాల నుంచి టూరిస్టులు వచ్చినప్పుడు ఈ డ్వార్ఫ్​లు రకరకాల ఫీట్లు చేసి వాళ్లను ఆనందింప చేస్తుంటారు. ఇలాంటి థీమ్ పార్క్​ ల నుంచి రాబడి బాగానే ఉన్నా శరీర లోపంతో చైనా బిజినెస్ చేసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.