భాష లేకపోతే స్వాతంత్య్రం లేదు..!

భాష లేకపోతే స్వాతంత్య్రం లేదు..!

భూమిపై ప్రతి నెల రెండు భాషలు అదృశ్యమవుతున్నాయి.  ప్రపంచంలోని సుమారు 6,700 భాషల్లో శతాబ్దాంతానికి సగం భాషలు మాత్రమే మిగులుతాయని అంచనా.  ప్రపంచ జనాభాలో 40శాతం మందికి పరభాషలోనే విద్య లభిస్తోంది.  కోట్లాది మంది తెలుగు మాట్లాడుతున్నారు. 

యునెస్కో వారి నిర్వచనం ప్రకారం దుర్బల, ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో తెలుగు లేదు. కానీ  ‘ఎథ్నోలాగ్’  నిర్వచనం ప్రకారం బాలలకు పరభాష మాత్రమే వారసత్వంగా లభిస్తున్నట్లయితే ఆ భాష ప్రమాదంలో ఉన్నట్టే.  ‘మీరు’, ‘మేము’ కలిసిన ‘మనం’ వంటి భావనలు.  ‘వారు’, ‘వీరు’ ‘మీరు’ వంటి లింగ వివక్ష లేని సర్వనామాలు ఎన్ని భాషల్లో ఉన్నాయి?  పద్యం, బుర్రకథ, హరికథ వంటి కళారూపాలు తెలుగువారి ఆస్తులు.  ఒక భాషకే  ప్రత్యేకమైన విజ్ఞానం. కాగా, కళలతో పాటు భాషను కోల్పోయిన జాతి తన ఉనికితోపాటు స్వాతంత్య్రం కూడా  కోల్పోతుంది.

ఒక భాష మరణిస్తే జరిగే నష్టమేమిటో తెలుసుకోవాలంటే 'హవాయి' భాష విషాదాన్ని గమనించాలి.  క్రీ.శ.1800 వరకు హవాయి సర్వ స్వతంత్ర దేశం. అనంతరం విదేశీ వ్యాపారుల రాకపోకలు మొదలయ్యాయి. ముందు ‘హవాయి' భాషలోనే మాట్లాడినా తరవాత ఇంగ్లీష్ అధిపత్యం మొదలైంది. 

1850లో రాజు ‘నాలుగో కామెహమెహ’ విదేశీయులతో పోటీ పడాలన్నా, మేధావులుగా తయారవాలన్నా ప్రజలు ఇంగ్లీష్ లోనే చదవాలి' అని ప్రకటించాడు.  పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ఆరంభమైంది. 1870 కల్లా అధికశాతం పాఠశాలలు ఇంగ్లీష్లోనే బోధన చేసేవి.  1893 కల్లా విదేశీ వ్యాపారులు రాజును పదవీచ్యుతుణ్ణి చేశారు. వెంటనే ఇంగ్లీష్​ అధికార భాషగా ప్రకటించారు. మరో పదేళ్లకు ‘హవాయి’ అమెరికాలో విలీనం అయిపోయింది. తరం మారింది.

 1940 కల్లా ‘ఇంగ్లీష్’ మాత్రమే వచ్చిన నూతన తరం తయారైంది. అయితే వారి ఇంగ్లీష్ యాస - ఇతర అమెరికన్ల ఇంగ్లీష్ సమాన స్థాయిలో లేకపోవడంతో ‘హవాయి’ ప్రజలు తక్కువ జీతాలతో, అవమానాలకు గురయ్యారు. క్రీ.శ.2000కు ఓ చిన్న దీవి ‘నిహావు’కు మాత్రమే హవాయి భాష పరిమితమైంది.

భాషను ప్రేమించే జాతి ప్రపంచాన్ని జయిస్తుంది

తమ భాషను ప్రాణంగా  ప్రేమించే జాతి ప్రపంచాన్ని జయిస్తుందనేది వాస్తవం. ఇప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తున్న 'ఇంగ్లీష్' భాషను రక్షించుకోవడానికి ఇంగ్లీష్ ప్రజలు 400 సంవత్సరాలపాటు పోరాటం చేశారు. నార్మన్లు 1066లో ఇంగ్లాండ్​ను జయించిన తరవాత అక్కడ ‘ఫ్రెంచి’ అధికార భాష అయింది. 

సామాన్యులు ఇంగ్లీష్ లో మాట్లాడినా పరిపాలన, న్యాయ వ్యవహారాలు ఫ్రెంచి, లాటిన్ భాషల్లో జరిగేవి. 300 సంవత్సరాల పోరాటం తరవాత 1356లో  కోర్టు వ్యవహారాలన్ని ఇంగ్లీష్​లో జరపాలని, లాటిన్​లో రికార్డు చేయాలని ‘ప్లీడింగ్ చట్టం’ ద్వారా ఆదేశించారు. వ్యాపారులు ఇంగ్లీష్ భాషను ఉపయోగించడం ఆరంభించారు. 

1489కి ఇంగ్లీష్ పూర్తి స్థాయి అధికార భాషగా చలామణిలోకి వచ్చింది. 1489 తరవాత ఇంగ్లీష్  ప్రపంచాధిపత్యానికి తెర లేచిందనే విషయం తెలిసిందే.  విద్యారంగంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉద్యోగావకాశాలను కారణంగా చూపిస్తారు.  కానీ, పాలనా వ్యవహారాలు ఆంగ్లంలో కొనసాగడానికి ఏ సాకు చెప్పలేరు.  

ప్రజల పట్ల, తెలుగు భాష పట్ల చులకన భావం సరికాదు. ఇప్పుడు తెలుగులో రాయగల, అనువదించగల, మాట్లాడగల సాంకేతిక సాధనాలు,  కృత్రిమ మేధస్సుతో  మన ప్రశ్నలకు తెలుగులో జవాబు రాసిపెట్టే  ‘చాట్ జీపీటీ’  వంటి ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో  మైక్రోసాఫ్ట్  ట్రాన్స్​లేటర్, భాషిణి,  ఏ భాషలోని ఎన్ని పేజీల  పత్రాలనైనా క్షణాల్లో తెలుగులోకి అనువదించగల సాఫ్ట్​వేర్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.  తెలుగులో మాట్లాడినా టైపు చేయగల సామర్థ్యం ఈ సాధనాలకు ఉంది.  తెలుగులో  టైపు చేసే ఉద్యోగులు లేరనే దబాయింపు కూడా సరికాదు.

ప్రజల భాషలో..

ఏ ప్రజలు చెల్లించిన పన్నులతో పరిపాలన సాగుతుందో  ఆ ప్రజలకు అర్థంకాని భాషలో సమాచారం ఇవ్వడం..- సమాచారం ఇవ్వకపోవడంతో సమానమని నిపుణుల అభిప్రాయం. పరిపాలన వ్యవహరాలు ప్రజల భాషలో జరగనప్పుడు గోప్యత పెరిగి, అవినీతికి అస్కారం పెరగుతుంది. అది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యం కాదు.  ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇకపై తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించడం ఆదర్శ పాలనకు ఒక ముందడుగు.  

పాలనా వ్యవహారాలు తెలుగులో కొనసాగించాలి

ఏదైనా సంక్లిష్ట పత్రం ముసాయిదా ఆంగ్లంలో రాసినప్పుడు దాన్ని 4-5 మార్లు సవరిస్తే,  నేరుగా తెలుగులో రాసినప్పుడు తుదిరూపు కోసం 1-2 మార్లు మాత్రమే సవరించాల్సిన అవసరం పడుతుంది. ఆంగ్లంలో రాస్తుండటం వల్ల  కనీసం 1 –2  పని గంటలు వృథా అవుతాయని అంచనా.  లెక్కగడితే  ఈ సమయం విలువ ఏటా రూ.50 కోట్లు దాటుతుంది.  

సమాచార హక్కు చట్ట లక్ష్యం ప్రజాసంస్థల పనితీరులో పారదర్శకత పెంచడం. అందుకు ఖచ్చితంగా పాలన వ్యవహారాలు తెలుగు భాషలో సాగించాలి.  సమాచార హక్కు చట్టం సెక్షన్-4(4) సమాచారమంతా స్థానిక అధికార భాషలోనే ఇవ్వాలని నిర్దేశిస్తోంది.  సమాచారం కోసం తెలుగులో దరఖాస్తు చేయడమే కాదు,  అవసరమైన సమాచారం కూడా తెలుగులో  కోరే  అధికారం చట్టం కల్పిస్తోంది.  సమాచార కమిషను పలు సందర్భాలలో ఆంగ్లంలోని  సమాచారాన్ని అధికార భాషలోకి అనువదించి ఇవ్వాలని ఆదేశించింది.

- శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు–