
- న్యూలఢక్ మూమెంట్ వ్యవస్థాపకుడు సోనమ్ వాంగ్ చుక్
- రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి: మేథా పాట్కార్
- నాంపల్లిలో ఎన్ఏపీఎమ్ 30 ఏండ్ల మహాసభలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పౌర ఉద్యమాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజాఉద్యమాలు లేకుంటే.. ప్రైవేట్ ఆధిపత్యం పెరుగుతుందని న్యూలడక్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్(ఎన్ఏపీఎమ్)30 ఏండ్ల మహాసభలు శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యాయి.
నాలుగు రోజులు జరగనున్న ఈ మహాసభలకు 24 రాష్ట్రాల నుంచి 800 మంది ఎన్ఏపీఎమ్ సభ్యులు హాజరయ్యారు. సభలో వాంగ్చుక్మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ల ఒత్తిళ్లకు తలొగ్గినప్పుడు పౌర సమాజం దాన్ని తిప్పికొట్టాలని సూచించారు. 6వ షెడ్యూల్ లో చేర్చాలనే లఢక్ ప్రజల డిమాండ్ ను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ కబంద హస్తాల నుంచి లఢక్ సహజ సంపదను కాపాడకపోవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు.
నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేథా పాట్కర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యంగంలో పొందుపరచిన సామాజిక న్యాయం, లౌకికవాదం బస్తర్, లఢక్ ఇతర ప్రాంతాలలో ఖూనీ అవుతోందని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, ఆదివాసీలు భూమి, మినరల్స్, నదులను రక్షించడం ద్వారా రాజ్యాంగ విలువలు, సమానత్వాన్ని కాపాడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రతిఘటన ఉద్యమాలకు తెలంగాణ రాష్ట్రం వేదిక అని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
మనుషుల మధ్య, అలాగే ప్రకృతికి మనుషులకు మధ్య బంధాలు బలపడినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రశాంత్ భూషణ్, నాగా మదర్స్ అసోసియేషన్ రోస్ మేరీ, అడ్వకేట్స్ భేళా భాటియా, షారుఖ్, టీఎమ్ క్రిష్ణ, అడ్వకేట్ షారుఖ్ ఆలం పాల్గొన్నారు.