ఖమ్మం, వెలుగు: సత్తుపల్లిలో ఆత్మీయ సభ సాక్షిగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని లీడర్ల ఐక్యతను చాటేందుకు ఉపయోగపడాల్సిన మీటింగ్ కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ఇన్విటేషన్ లేకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మీటింగ్ కు ముందు నుంచే తుమ్మలను పిలవొద్దంటూ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అభ్యంతరం చెబుతున్నారని, పొంగులేటిని పిలవొద్దంటూ విప్ రేగా కాంతారావు అంటున్నారని లీకులు బయటకు వచ్చాయి. దీంతో అసలు మీటింగ్ సమయానికి ఎవరెవరు వస్తారనే ఆసక్తి నెలకొనగా, తుమ్మల అటెండ్ కాలేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశానికి వచ్చి, వేదికపైనే సెటైర్ వేశారు. ఇక తుమ్మలను పిలవకపోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టార్గెట్ చేసుకొని తుమ్మల అభిమానులు వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారు.
వారిద్దరినీ పిలవలే..
వేంసూరు మండలం కందుకూరుకు చెందిన డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, ఖమ్మానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి సత్తుపల్లి వస్తున్న సందర్భంగా శుక్రవారం రోడ్ షో, సన్మాన సభ ఏర్పాటుచేశారు. జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ కు రావాలంటూ జిల్లా పార్టీ నుంచి గానీ, స్థానిక ఎమ్మెల్యే నుంచి గానీ తమకు ఆహ్వానం అందలేదని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. పార్థసారథిరెడ్డి మాత్రమే ఫోన్ చేసి మీటింగ్ కు రావాలని ఆహ్వానించారని అంటున్నారు. పార్టీలోనే ఉండి పని చేస్తున్నా, పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి పిలవకపోతే ఎట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంతోనే సత్తుపల్లిలోనే ఉన్నప్పటికీ తుమ్మల మీటింగ్ కు హాజరు కాలేదు. శనివారం విడిగా గంగారంలోని సాయిస్ఫూర్తి కాలేజీలో పార్థసారథిరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఇక మీటింగ్ వేదికపైనే పొంగులేటి, తనను పార్థసారథిరెడ్డే పిలిచారు అంటూ జనాలకు తెలిసేలా చెప్పారు.
ఇలాంటి గొడవలు కామన్..
ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో లీడర్ల ఉన్న గొడవలు చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. కొద్దినెలల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం వచ్చిన సమయంలోనూ విభేదాలను పక్కనపెట్టి కలిసి పని చేయాలని చెప్పారు. అయినా ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆయా నియోజకవర్గాల్లో మాజీల పర్యటనలు, కార్యక్రమాలు చేయడం ప్రధానంగా విభేదాలకు కారణమవుతోంది. టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిన వారు, ఇతర పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారి మధ్య వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ విషయంపై గొడవలున్నాయి. తాము బరిలో ఉంటామంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటూ, వారి వెంట ఉన్న కార్యకర్తలు దూరం కాకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ ఒకసారి, సిట్టింగ్ లకు టికెట్ ఖాయమంటూ మరోసారి పార్టీ హైకమాండ్ చెప్పడం కార్యకర్తల్లో కన్ఫ్యూజన్కు కారణమవుతోంది. ఇక పొత్తుల్లో తమకు టికెట్ దక్కుతుందంటూ కమ్యూనిస్టు పార్టీలు కొన్ని స్థానాలను ప్రకటించుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బయట పడడం ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చకు దారితీస్తోంది.
పార్థసారథిరెడ్డితో తుమ్మల భేటీ
సత్తుపల్లి: రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం భేటీ అయ్యారు. స్థానికంగా జరిగిన కృతజ్ఞతా సభకు హాజరైన పార్థసారథిరెడ్డి శుక్రవారం రాత్రి గంగారం సాయిస్ఫూర్తి కాలేజీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గెస్ట్‌హౌస్‌లో ఎంపీని కలిసిన తుమ్మల అభినందనలు తెలిపారు. కృతజ్ఞతా సభకు తుమ్మల దూరంగా ఉండడంపై స్పందిస్తూ తనకు పార్టీ పరమైన ఆహ్వానం అందలేదని, అందుకే సభకు దూరంగా ఉన్నానని తెలిపారు. పార్థసారథిరెడ్డితో తనకున్న అవినాభావ సంబంధంతో ఆయనను కలిసేందుకు వచ్చానని తుమ్మల తెలిపారు. ఈ
భేటీలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.