క్రికెటర్ల కుటుంబాలకు కొన్ని రోజులే అనుమతి.. బీసీసీఐ ఆంక్షలు

న్యూఢిల్లీ: బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా తీవ్రంగా నిరాశపరచడంతో  ఇకపై ఫారిన్‌‌ టూర్స్‌‌లో  కఠినమైన ప్రొటోకాల్స్ అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్లేయర్లు, కోచ్‌‌లు ఫారిన్ టూర్స్‌‌లో తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని తగ్గించనుంది. అలాగే, ప్రాక్టీస్, మ్యాచ్‌‌ల కోసం ప్రయాణం చేసేటప్పుడు టీమ్‌‌ బస్సుల్లో మాత్రమే వెళ్లాలని, వేరే వాహనాల ఉపయోగంపై  నిషేధం విధించనుంది. 

ఈ నిబంధనల ప్రకారం  45 రోజులు, అంతకంటే ఎక్కువ కాలం జరిగే టూర్స్‌‌లో ఆటగాళ్ల  భార్యలు, పిల్లలు 14 రోజుల కంటే ఎక్కువకాలం వారి వెంట ఉండకూడదు. ఒకవేళ టూర్‌‌‌‌ తక్కువ రోజులే ఉంటే భార్యాపిల్లలు ప్లేయర్లతో కలిసి ఉండే సమయాన్ని మరింత తగ్గిస్తారు. ఇక టీమ్‌‌ బస్సుల్లో  క్రికెటర్లు, కోచ్‌‌ల పర్సనల్ మేనేజర్లు ప్రయాణించకుండా కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఈ రూల్ ఇప్పటికే అమల్లో ఉన్నా.. ఆసీస్‌‌ టూర్‌‌‌‌లో ఓ కోచ్‌‌ మేనేజర్ టీమ్ బస్సులో ప్రయాణించాడు. ఇండియా టీమ్‌‌లోని రిజర్వ్ ఆటగాడి భార్య టీమ్ ప్రయాణ వివరాలు బహిర్గతం అయ్యేలా తన యూట్యూబ్‌‌ చానెల్‌‌లో వీడియోలు పోస్ట్ చేయడంతో ఇకపై ప్రొటోకాల్స్ కఠినంగా అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.