మంచిర్యాల, వెలుగు: కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ శివారులోని రెండున్నర ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాకు గురైంది. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని ఆక్రమించారు. దాని చుట్టూ గతంలోనే ఫెన్సింగ్ వేసి, ఇటీవల షెడ్లు నిర్మించారు. ఈ వ్యవహారంలో బెల్లంపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు మరో కీలక ప్రజాప్రతినిధి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నార్వకు చెందిన పవన్‌కుమార్ అనే వ్యక్తి ఆగస్టు 28న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నెలన్నర రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో.. ఇప్పుడు ఏకంగా షెడ్లు కట్టి గుంటకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల చొప్పున అమ్ముతున్నట్టు సమాచారం.
పవన్‌కుమార్ చేసిన ఫిర్యాదు ప్రకారం..
పెద్దనపల్లి శివారులో గోకారపు సమ్మయ్య అనే వ్యక్తి పేరిట సర్వేనంబర్ 5/128లో 5 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది. పీవోటీ చట్టం 1977కు విరుద్ధంగా ఇందులో నుంచి 2 ఎకరాల 20 గుంటలను సామాల రాంబాబు అనే వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. మిగిలిన 2 ఎకరాల 2.20 గంటలను గోకారపు సమ్మయ్య మనుమడు విరాసత్ చేసుకొని అప్పారావు అనే వ్యక్తికి విక్రయించాడు. అప్పారావు రాయణవేణి మధురమ్మకు అమ్మాడు.
ఇది కూడా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే సమ్మయ్య 5 ఎకరాల అసైన్డ్భూమితో పాటు మరో 2 ఎకరాల 20 గంటలను కబ్జా చేశాడు. ఈ భూమిని సాదాబైనామా ద్వారా బాలయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు విక్రయపత్రం తయారు చేసి, యాదగిరికి అమ్మినట్టు 2వ పత్రం తయారు చేసి దాడి పోశం, శ్రీధర్ అనే వ్యక్తులకు అమ్మాడు. కాగా వారు ఈ భూమిని ప్లాట్లు చేసి అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. సదరు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజావసరాలకు వినియోగించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఓ అధికారి హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.