బాలానగర్ నుంచి కొత్తగా రెండు బైపాస్ రోడ్లు
ఒకటి కల్వకుర్తి వరకు.. మరొకటి పాలమూరుకు
డీపీఆర్ సిద్ధం చేస్తున్న ఆర్అండ్బీ ఆఫీసర్లు
తెలంగాణ, రాయలసీమలో 12 లేన్లకు విస్తరించనున్న ఎన్‌హెచ్ 44
మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరు రోడ్లకు మహర్దశ రానుంది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంత రోడ్లను సింగిల్ నుంచి డబుల్‌రోడ్లుగా డెవలప్చేసేందుకు రాష్ట్ర సర్కారు నిధులు కేటాయించింది. కొద్ది రోజుల కిందట వీటి పనులు ప్రారంభం కాగా, త్వరలో నేషనల్ హైవే- 44 నాలుగు లేన్ల నుంచి 12 లేన్లకు విస్తరించనుంది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్, కల్వకుర్తి ప్రాంతాలకు ఎన్‌హెచ్-44 నుంచి లింక్ కలిపేలా బైపాస్ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రపోజల్స్ రెడీ చేస్తోంది.
ట్రాఫిక్ సమస్యకు చెక్
ఎన్ హెచ్-44పై బాలానగర్ మండల కేంద్రం నుంచి రెండు బైపాస్ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో ఒకటి మాచారం క్రాస్ రోడ్డు నుంచి ఉడిత్యాల, నవాబుపేట మీదుగా మహబూబ్‌నగర్‌కు లింక్ కలిపేలా యోచిస్తోంది. దాదాపు 30 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ రోడ్డును నిర్మించనుంది. మరో బైపాస్‌ను గౌతాపూర్, పెద్ద రేవల్లి, తొమ్మిదిరేకుల , మిడ్జిల్, కల్వకుర్తి వరకు.. లేదా మైసిగండి నుంచి కడ్తాల్ మీదుగా కల్వకుర్తి లింక్ కలిపేలా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించిన ఆర్అండ్బీ శాఖ డీపీఆర్సిద్ధం అవుతోంది. ఈ రెండు బైపాస్‌లు ఏర్పాటు చేయడం వల్ల జడ్చర్ల టౌన్లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌పడనుంది. ఇప్పటికే జడ్చర్ల టౌన్లో అటు కల్వకుర్తికి వెళ్లే రోడ్డు, ఇటు మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్లకు రావడానికి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. బాలానగర్ వద్ద బైపాస్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్య తీరనుంది.
12 లేన్లుగా ఎన్‌హెచ్-44
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎన్‌హెచ్-44 విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు మొత్తం 576 కి.మీ. మేర ఈ రహదారి ఉండగా.. బూర్గుల గేట్ నుంచి పుల్లూరు వరకు 149 కి.మీ. ఉంది. ఉమ్మడి బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, ఉమ్మడి అడ్డాకుల, కొత్తకోట, పెబ్బేరు, ఇటిక్యాల, మానవపాడు, ఉమ్మడి అలంపూర్ మీదుగా ఈ రోడ్డు సాగుతోంది. అయితే ఈ రోడ్డును గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఆరు లేన్లుగా విస్తరించేందుకు నిర్ణయించింది.
ఇప్పుడు తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల మీదుగా బెంగళూరు వరకు 12 లేన్లు చేయాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కేంద్ర బడ్జెట్లోనూ హైదరాబాద్– బెంగళూరు కారిడార్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సమీపంలోని కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు నిధులు మంజూరు చేశారు. తద్వారా పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉంటుందని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ హైవే పొంటి ఉన్న బ్లాక్ స్పాట్స్వద్ద అండర్‌పాస్‌లు, సర్వీస్‌రోడ్లు, అవసరం ఉన్న చోట్ల ఫ్లై ఓవర్లను నిర్మిచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
రూ.350 కోట్లతో రోడ్ల అభివృద్ధి
మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని గ్రామాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఈ మూడు ప్రాంతాల్లో రోడ్ల డెవలప్మెంట్ కోసం రూ.350 కోట్లు సాంక్షన్ చేసింది. ఇందులో కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట ప్రాంతాల్లో సింగిల్‌రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు, ఐదు చోట్ల బ్రిడ్జిలు నిర్మాణానికి, రెండు ప్రాంతాల్లో గుంతలు పడిన రోడ్లకు రిపేర్లు చేయడానికి రూ.215 కోట్లు కేటాయించింది. జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్, నవాబ్‌పేట, మిడ్జిల్ ప్రాంతాల్లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు రూ.133 కోట్లు విడుదల చేసింది. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలో ఈ పనులు ప్రారంభం కాగా.. జడ్చర్ల నియోజకవర్గంలో టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులకు కొబ్బరికాయ కొట్టారు.
టెండర్లు పూర్తయ్యాకే కొబ్బరికాయ కొడ్తున్నం
గత ప్రభుత్వం డెవలప్మెంట్ వర్క్స్‌కు టెండర్లు పిలవకుండానే శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టేది. ఆ తర్వాత పనులన్నీ పెండింగ్‌లోనే పెట్టేది. మా ప్రభుత్వం మాత్రం టెండర్లు పూర్తై, పనులు కాంట్రాక్టర్లకు అప్పగించాకే కొబ్బరికాయలు కొడుతున్నాం. బాలానగర్ మండలం నుంచి రెండు బైపాస్‌లు నిర్మించడానికి నిర్ణయించాం. ఆఫీసర్లు డీపీఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు. అన్ని పూర్తయితే జడ్చర్లతోపాటు బాలానగర్ నుంచి పాలమూరు, కల్వకుర్తికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా వెళ్లే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తాం.
జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల