నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో దారుణం. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై -ఓ అమ్మాయిని గొడ్డలితో నరికి చంపాడు ఓ కుర్రోడు. అత్యంత కిరాతకంగా.. అందరూ చూస్తుండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన 23 ఏళ్ల పెట్పల్లి అలేఖ్య, 25 ఏళ్ల పెట్పల్లి జియాతో కలిసి ఖానాపూర్ మార్కెట్ కు వచ్చారు. వస్తువులు కొనుగోలు చేసి.. తిరిగి అంబేద్కర్ నగర్ లోని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో.. సరిగ్గా శివాజీనగర్ ప్రాంతానికి రాగానే.. ఓ వ్యక్తి గొడ్డలితో వీరిపై దాడి చేశాడు. ఈ దాడిలో 23 ఏళ్ల అలేఖ్య రోడ్డుపైనే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన జియాను ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు ఉన్న మూడేళ్ల చిన్నారి రియన్స్ కు గాయాలు అయ్యాయి. ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గొడ్డలితో దాడి చేసింది అలేఖ్యకు తెలిసిన వ్యక్తే అంటున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం అంటున్నారు పోలీసులు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు.