
మంచిర్యాల, వెలుగు : చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత ఓ మహిళ చనిపోయింది. ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన గొల్లి రవళిక (26)కు సోమవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని నందిని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. టెస్ట్ చేసిన డాక్టర్ ఉదయం 11 గంటలకు ఆపరేషన్ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత రవళికకు రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో ఆమె భర్త వెంకటేశ్ బయటకు వెళ్లాడు. బ్లడ్ తీసుకొని వచ్చేసరికి రవళిక కనిపించలేదు. దీంతో తన భార్య ఎక్కడ అని సిబ్బందిని ప్రశ్నించడంతో బ్లీడింగ్ అవుతుందని, కండిషన్ సీరియస్‌గా ఉన్నందున మెడిలైఫ్ హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు.
అక్కడ ట్రీట్‌మెంట్ చేస్తుండగానే మధ్యాహ్నం రవళిక చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రవళిక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మెడిలైఫ్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ బన్స్‌లాల్ హాస్పిటల్ వద్దకు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. నష్టపరిహారం చెల్లించేందుకు నందిని హాస్పిటల్ మేనేజ్‌మెంట్ అంగీకరించడంతో ఆందోళన విరమించారు. కాగా శిశువు అవయవలోపంతో జన్మించడంతో ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.