సంగారెడ్డి జిల్లాలో ఆటోలో మహిళపై లైంగిక దాడి..భర్తను కొట్టి ఆపై అత్యాచారం

సంగారెడ్డి జిల్లాలో ఆటోలో మహిళపై లైంగిక దాడి..భర్తను కొట్టి ఆపై అత్యాచారం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
  • సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద ఘటన

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ మహిళ(35)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. భర్తను చితకబాది అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన దంపతులు సోమవారం రాత్రి సదాశివపేట మండలం పెద్దాపూర్  గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి, మంగళవారం తెల్లవారుజామున ఆటోలో తిరిగి వస్తున్నారు. ఆటోను ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెంబడించారు. మామిడిపల్లి చౌరస్తా వద్దకు చేరుకోగానే మూత్ర విసర్జన కోసం ఆటోను భర్త ఆపడంతో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగికదాడికి యత్నించారు.

ఆమె గట్టిగా అరవడంతో భర్త వచ్చి అడ్డుకోబోగా అతడిని చితకబాదారు. ఆ తరువాత అత్యాచారం చేసి పరారయ్యారు. సంగారెడ్డి రూరల్  పోలీసులకు దంపతులు ఫిర్యాదు చేయడంతో బాధితురాలిని సంగారెడ్డి భరోసా సెంటర్ కు పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రూరల్  ఎస్సై రవీందర్  తెలిపారు.