
- మర్డర్ చేసి మూట కట్టి సంపులో పడేసింది
- నిందితురాలు అరెస్ట్.. పరారీలో ప్రియుడు
జవహర్‌నగర్/తార్నాక/పద్మారావునగర్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని వృద్ధురాలైన తల్లిని, మతిస్థిమితం లేని అక్కను ప్రియుడితో కలిసి చంపించిందో చెల్లి. ముందు అక్కను చంపి మూట కట్టి సంపులో పడేసి మూత పెట్టింది. రెండు రోజులకు తన తల్లి ఇంటికి ప్రియుడిని పంపించి ఒంటిపై బంగారం దోచుకుని హత్య చేయాలని సూచించింది. ఇలా చేస్తే దొంగ చేసిన పనిగా పోలీసులు భావిస్తారని ప్లాన్ చేసింది. అయితే, సీసీ కెమెరాలు, పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ జవహర్‌నగర్, లాలాగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ముందు తల్లి వంతు..
నార్త్ లాలాగూడకు చెందిన ఉడుగుల సుశీల(60)కు జ్ఞానేశ్వరి(45), లక్ష్మి (40), ఉమామహేశ్వరి(35) శివ కైలాస్(37) పిల్లలు. కూతుళ్లెవరికీ పెండ్లిళ్లు కాలేదు. జ్ఞానేశ్వరికి మానసికస్థితి సరిగా లేదు. ఉమామహేశ్వరి లాల్ బజార్ లోని ఓ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తోంది. కొడుకు శివ యూఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. రైల్వేలో పని చేసే సుశీల భర్త కొన్నేండ్ల కింద అనారోగ్యంతో చనిపోగా.. అతడి ఉద్యోగాన్ని రెండో కూతురు లక్ష్మికి ఇచ్చారు.
జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. సుశీల తన కోడలు స్రవంతి, కూతురు ఉమామహేశ్వరితో కలిసి ఉంటోంది. లక్ష్మి..లాలాగూడ రైల్వేవర్క్ షాపులో జాబ్ చేస్తూ తన అక్క జ్ఞానేశ్వరితో కలిసి రైల్వే క్వార్టర్స్ లో ఉంటోంది. కాగా, జవహర్‌నగర్‌కు చెందిన అరవింద్ కుమార్(45) అలియాస్అరుణ్తో 2010 నుంచి వీరి కుటుంబానికి పరిచయాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మికి అరవింద్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తిరుగుతుండడంతో చాలాసార్లు గొడవలు జరిగాయి.
గురువారం ఉదయం కోడలు, కూతురు డ్యూటీకి వెళ్లగా సుశీల ఒంటరిగా ఇంట్లో ఉంది. రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి పెద్ద శబ్దాలు వస్తుండడంతో స్థానికులు ఉమామహేశ్వరికి ఫోన్‌చేశారు. ఆమె తల్లికి కాల్చేయగా రిసీవ్ చేసుకోలేదు. ఇంటికి వచ్చిచూడగా తల్లి శవమై కనిపించింది. సీసీ కెమెరాలు చెక్ చేయగా అరవింద్ కుమార్ గోడ దూకి పారిపోతున్నట్టు కనిపించింది. దీంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సీఐ సైదయ్య దర్యాప్తు చేపట్టారు.
విచారణలో విస్తుపోయే మరో నిజం
పోలీసులు కేసు విచారణలో ఉమా మహేశ్వరి అక్క లక్ష్మికి, అరవింద్‌కు మధ్య సంబంధం ఉందని తెలుసుకున్నారు. దీంతో లాలాగూడ రైల్వే క్వార్టర్స్ కు వెళ్లి లక్ష్మిని విచారించగా షాక్‌కు గురి చేసే మరో విషయం చెప్పింది. తమ సంబంధానికి అడ్డుగా వస్తున్న జ్ఞానేశ్వరిని కూడా రెండు రోజుల క్రితం చంపి సంపులో మూటకట్టి పడేసినట్లు చెప్పింది.
దీంతో లాలాగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రఘు బాబు నేతృత్వంలో సంపులో చూడగా జ్ఞానేశ్వరి డెడ్‌బాడీ డీ కంపోజ్అయిన స్థితిలో కనిపించింది. దీంతో డెడ్‌బాడీని బయటకు తీసి గాంధీ మార్చురీకి తరలించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరవింద్ కోసం గాలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మాత్రమే తెలిసిందని, అరవింద్‌ను పట్టుకున్నాక విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.