కదులుతున్న బస్సులో అత్యచారం

కదులుతున్న బస్సులో అత్యచారం
  • నిద్రపోతున్న మహిళపై డ్రైవర్ అత్యాచారం
  • స్లీపర్‌‌‌‌ కోచ్​ బస్సులో నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యం
  • మహిళ అరుపులతో ప్రయాణికుల అలర్ట్
  • బస్సు ఆపాలని చెప్పినా స్పీడ్ గా పోనిచ్చిన మరో డ్రైవర్ 
  • 100కు డయల్ చేసిన బాధితురాలు
  • మెట్టుగూడలో బస్సును అడ్డుకున్న పోలీసులు 

హైదరాబాద్‌‌/సికింద్రాబాద్, వెలుగు: ప్రైవేట్‌‌  ట్రావెల్స్  డ్రైవర్లు దారుణానికి ఒడిగట్టారు. కదులుతున్న బస్సులో మహిళా ప్యాసింజర్‌‌‌‌పై ఒక డ్రైవర్  అత్యాచారానికి  పాల్పడగా.. మరో డ్రైవర్  అతనికి సహకరించాడు. చివరకు బాధితురాలు 100కి ఫోన్  చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెట్టుగూడలో బస్సును అడ్డుకొని డ్రైవర్‌‌‌‌ను అరెస్ట్‌‌  చేశారు. బస్సును సీజ్ చేశారు. హరికృష్ణ ట్రావెల్స్‌‌  కంపెనీకి చెందిన బస్సులో   సోమవారం అర్ధరాత్రి  ఈ ఘోరం జరిగింది. ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌  రాజేందర్‌‌‌‌  తెలిపిన వివరాల ప్రకారం.. హరికృష్ణ ట్రావెల్స్‌‌కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం నిర్మల్  నుంచి ప్రకాశం జిల్లాకు బయలుదేరింది.

బస్సులో డ్రైవర్లు  సిద్దయ్య (40), కృష్ణ (35) ఉన్నారు. 36  మంది ప్రయాణికులతో బస్సు నిర్మల్‌‌  నుంచి బయలుదేరింది. బస్సు స్లీపర్  కోచ్  కావడంతో ప్యాసింజర్లు నిద్రించేందుకు ప్రత్యేక సీట్లు ఉన్నాయి. ఇదే బస్సులో ఓ వివాహిత (25) తన కూతురితో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్నది. 1వ నంబర్  బెర్త్ బుక్ చేసుకుని నిర్మల్ లో బస్సు ఎక్కింది. వెహికల్  మెదక్  జిల్లా చేగుంటకు రాగానే రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం కోసం బస్సు ఆపారు. అందరూ హోటల్ లో భోజనాలు చేశాక  తిరిగి బస్సెక్కారు.

అదే సమయంలో ఒకే సీటులో నిద్రించేందుకు ఇబ్బందిగా ఉందని బాధిత మహిళ రెండో డ్రైవర్ కృష్ణకు తెలిపింది. ఏదైనా బెర్తు ఖాళీగా ఉంటే తమకు కేటాయించాలని కోరింది. దీంతో వారికి 5, 6వ బెర్తులు అలాట్  చేశాడు. తల్లీకూతురు ఇద్దరూ ఆయా బెర్తులో పడుకున్నారు. ఇద్దరు నిద్రపోయాక రెండో డ్రైవర్  కృష్ణ ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె నోట్లో బ్లాంకెట్‌‌  కుక్కి  అత్యాచారం చేశాడు. దీంతో బస్సు ఆపాలంటూ బాధితురాలు కేకలు వేసినా డ్రైవర్  సిద్దయ్య బస్సు ఆపలేదు. ఆమె అరుపులకు మిగతా ప్రయాణికులు మేల్కొని  బస్సు ఆపించేందుకు ప్రయత్నించారు. అయినా డ్రైవర్  సిద్దయ్య బస్సు ఆపకుండా అతివేగంగా డ్రైవ్‌‌  చేశాడు. దీంతో 12.44 గంటలకు బాధిత మహిళ 100కు కాల్‌‌ చేసింది.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

100కు వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సు లొకేషన్‌‌  ఆధారంగా సికింద్రాబాద్  రైల్  నిలయం దాటి ఉప్పల్  వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో దగ్గర్లోని ఓయూ పోలీసులను అప్రమత్తం చేశారు. తార్నాక  మెట్రో పిల్లర్ 1010 వద్ద ఓయూ పోలీసులు బస్సును అడ్డుకున్నారు. ఇది గమనించిన రెండో డ్రైవర్‌‌‌‌  కృష్ణ.. మెట్టుగూడ సిగ్నల్  వద్ద బస్సు దిగి పారిపోయాడు. బస్సు డ్రైవ్  చేసిన సిద్దయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌‌కు తరలించారు. పారిపోయిన కృష్ణ కోసం గాలించి అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.