
సిద్దిపేట రూరల్, వెలుగు: హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చన్న నిర్వాహకుల మాటలు నమ్మి మోసపోయిన బాధితురాలు గురువారం సిద్దిపేటలో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు హెర్బల్ ప్రొడక్ట్స్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. బాధితురాలి భర్త రాజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాధవ్ అలియాస్ ముదాసర్, రాజు, మనీషా సమ్రీన్ న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సంస్థలో చేరి హెర్బల్ ప్రాడక్ట్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, బరువు తగ్గుతారని ప్రచారం చేశారు. వారిని నమ్మి తన భార్య స్వప్న సెంటర్ లో చేరి నెల రోజుల పాటు హెర్బల్ ప్రొడక్ట్స్ తీసుకుందని తెలిపారు.
ప్రోడక్ట్స్ అమ్మితే అదనపు అదాయం సంపాదించుకోవచ్చని చెప్పడంతో తాను వద్దంటున్నా రూ. లక్ష పెట్టి సరుకు తీసుకుందని, కొత్తగా సెంటర్ ఏర్పాటు చేయాలంటే మరో రూ.4లక్షల ప్రొడక్ట్స్ కొనాలని పేచీ పెట్టడంతో తనను మోసం చేశారని భావించిన స్వప్న నెలరోజుల కిందట నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. తీవ్ర అనారోగ్య పాలైన స్వప్న అసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ స్వప్న రాసిన లెటర్ గురువారం బయటపడటంతో కుటుంబసభ్యులు ఆగ్రహంతో గురువారం ఉదయం న్యూట్రిషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సెంటర్ నిర్వాహకులను, బాధితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.