జనగామ, వెలుగు: అత్తామామ వారసత్వ భూమిని పట్టా చేయకుండా అమ్మాలని చూస్తున్నారని ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో వెళ్లి జనగామ తహసీల్దార్ ఆఫీసు వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలు తేజావత్యశోద తెలిపిన ప్రకారం.. జనగామ మండలం ఎర్రగొల్లపాడు పెద్ద తండాకు చెందిన మామ తేజావత్ బాన్యాకు నలుగురు సంతానం కాగా, ఆయన పేరుపై16 .20 ఎకరాల భూమి ఉంది. అందులో 4.2 ఎకరాలు పెద్ద కొడుకుకు, మరో రెండెకరాలు ఇంకో కొడుకుకు పట్టా చేశారు. ఇంకొక కొడుకు, తన భర్త శ్రీనివాస్ పేరుపై మాత్రం పట్టా చేయడంలేదని ఆరోపించింది. తనకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, భర్త శ్రీనివాస్ కూడా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మామ మరో ఎకరం భూమిని ఇతరులకు అమ్మాలని చూస్తున్నారని, రిజిస్ట్రేషన్‌ను చేయవద్దంటూ గురువారం తన పిల్లలతో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి వారసత్వంగా తమకు రావాల్సిన వాటా భూమి రిజిస్ట్రేషన్చేయించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నట్టు తెలిపింది. అధికారులు స్పందించకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోబోగా.. సమాచారం అందడంతో జనగామ టౌన్‌సీఐ దామోదర్ రెడ్డి అక్కడి వెళ్లారు. ఆమెకు నచ్చజెప్పగా సమస్య సద్దుమణిగింది. తహసీల్దార్ వెంకన్నను వివరణ కోరగా.. స్లాట్బుక్చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్నిలిపివేసే అధికారం తమకు లేదన్నారు. భూ సమస్యలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకోవాలని బాధితురాలికి సూచించినట్టు చెప్పారు.