
- సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు
- దోషం పోతుందనే మూఢ నమ్మకంతో మహిళ కిరాతకం
- దేవుళ్ల పటాల ముందు 7 నెలల కూతురు గొంతుకోసి హత్య
- జ్యోతిష్యుడు చెప్పింది విని.. యూ ట్యూబ్లో చూసి దారుణం
- మేకలపాటి తండాలో 2021 ఏప్రిల్‌లో ఘటన
సూర్యాపేట /మోతె, వెలుగు: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోతె మండలం మేకలపాటి తండాలో మూఢ నమ్మకాలతో కూతురును బలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి డాక్టర్ ఎమ్. శ్యాంశ్రీ శుక్రవారం తీర్పునిచ్చారు. 2021 ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల ఆవాస గ్రామమైన మేకలపాటి తండాకు చెందిన బానోతు భారతి అలియాస్ లాస్య అలియాస్ బుజ్జి (32) డిగ్రీ, బీఈడీ పూర్తి చేసింది. ముందుగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తితో ఆమెకు వివాహం కాగా.. విడాకులు తీసుకుంది.
అనంతరం చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మేకలపాటి తండాకే చెందిన బానోతు కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నది. పెళ్లికి ముందు నుంచే ఆరోగ్య పరిస్థితి బాగా లేక పోవడంతో తల్లిదండ్రులు.. ఆమెను నాటు వైద్యులకు చూయించేవారు. సర్పదోషం ఉందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో.. భారతి రకరకాల పూజలు చేస్తూ గడిపేది. ఒక పాప పుట్టినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. అదేసమయంలో గతంలో జ్యోతిష్యం చెప్పిన వ్యక్తి తండాకు వచ్చాడు. సర్ప దోషం పోవాలంటే ఏమి చేయాలని అతన్ని భారతి అడగ్గా.. బిడ్డను బలివ్వాలని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి యూట్యూబ్ చూస్తూ వారంలో 3 రోజులు నాగ పూజలు నిర్వహించేది. భర్త, అత్త ఎన్ని సార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. మానసిక సమస్యలతో బాధ పడుతూ మూఢభక్తితో పూజలు చేస్తూనే ఉండేది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
2021 ఏప్రిల్ 15 న సాయంత్రం వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారతి పూజలు మొదలుపెట్టింది. తన 7 నెలల కూతురు గొంతు, నాలుక కోసి దేవత పటాల ముందు బలి ఇచ్చింది. ‘నా బిడ్డను చంపేశా.. నాకిక ఎలాంటి దోషం లేదం’టూ కేకలు వేసింది. అనంతరం అదే గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఇంటికి వెళ్లి చూసే సరికి 7 నెలల చిన్నారి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. భర్త కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సొంతకూతురిని హతమార్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. కేసు విచారణ మొదలయినప్పటి నుంచి జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ప్రత్యేక శ్రద్ధ వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, మోతె ఎస్ఐ యాదవేంద్రకు ఎస్పీ సలహాలు ఇస్తూ.. పకడ్బందీగా విచారణ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి రవీందర్ ఆధ్వర్యంలో బలమైన వాదనలు వినిపించారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం భారతికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
భర్తపైనా దాడి..
కూతురిని చంపిన భారతి ఆ తర్వాత భర్త కృష్ణ మీద కూడా దాడికి పాల్పడింది. హత్య కేసులో అరెస్టయిన ఆమె 2023లో బెయిల్ పై విడుదలైంది. పెద్ద మనుషులు ఒప్పించడంతో భారతిని ఆమె భర్త కృష్ణ ఇంటికి తీసుకెళ్లాడు. అతడు నిద్ర పోతున్న సమయంలో రాడ్డు తో దాడి చేసి.. హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో ఆమెకు హుజూర్ నగర్ సబ్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.