భర్తకు వీడియో కాల్ చేసి ఉరివేసుకున్న భార్య

భర్తకు వీడియో కాల్ చేసి ఉరివేసుకున్న భార్య

భర్త చూస్తుండగానే ఆత్మహత్యచేసుకుంది ఓ మహిళ. తనను పుట్టింటి నుంచి తీసుకెళ్లడం లేదనే మనస్తాపంతో.. భర్తకు వీడియో కాల్ చేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అనంతపురం బాబేనాయక్ తండాకు చెందిన రమ్యశ్రీకి కర్ణాటకకు చెందిన చందునాయక్ తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 11 నెలల కూతురు ఉంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో రమ్యశ్రీ తన మదనపల్లెలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.ఎన్నిరోజులైనా  భర్త తనను తీసుకెళ్లడం లేదని మనస్తాపం చెందిన రమ్యశ్రీ శుక్రవారం తన భర్తకు వాట్సప్ తో వీడియో కాల్ చేసింది. భర్త చూస్తుండగానే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే చందునాయక్ రమ్యశ్రీ తల్లి కమలమ్మకు ఫోన్ చేసి చెప్పాడు.ఆమె ఇంట్లోకి వెళ్లేసరికి ఫ్యాన్ కు వేలాడుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అల్లుడి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని రమ్యశ్రీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.