కులాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నందుకే.. కానిస్టేబుల్ అక్కను.. తమ్ముడు చంపేశాడా.. లేక ఇంకేమైనా కారణాలు..?

లేడీ కానిస్టేబుల్ నాగమణి హత్య సంచలనంగా మారింది. సొంత తమ్ముడు పరమేష్.. అత్యంత కిరాతకంగా.. నడిరోడ్డుపై నరికి చంపటం చర్చనీయాంశం అయ్యింది. 15 రోజుల క్రితమే.. కానిస్టేబుల్ నాగమణి.. ఇంట్లో వాళ్లను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నది. వారిది కులాంతర వివాహం. ఈ పెళ్లిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు తమ్ముడు పరమేష్.. కానిస్టేబుల్ అక్క.. ప్రేమ పెళ్లి.. అందులోనూ మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అత్యంత కిరాతకంగా చంపేశాడు..

తన చేతుల్లో పెరిగిన తమ్ముడి చేతిలోనే.. అక్క నాగమణి చనిపోవటం గ్రామస్తులను సైతం షాక్ కు గురిచేసింది. తమ్ముడిని గారాబంగా పెంచిన అక్కనే.. తమ్ముడు చంపటం కుటుంబ సభ్యులు, బంధువులను సైతం ఆగ్రహానికి గురి చేస్తుంది. అక్క ప్రేమ పెళ్లి.. అందులోనూ మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఒక్కటే.. కానిస్టేబుల్ నాగమణి హత్యకు కారణం కాదనే వాదన వినిపిస్తుంది. 

ఆస్తుల విషయంలో గొడవలు కూడా ఉన్నట్లు గ్రామస్తుల టాక్. కానిస్టేబుల్ నాగమణి పేరుతో కొంత భూమి ఉంది.. కులాంతర పెళ్లి విషయంలో ఈ ఆస్తుల గొడవ జరిగిందని.. దీంతో తన పేరును ఉన్న భూమిని తమ్ముడిని రాసిచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు గ్రామస్తులు. అయితే ఇంకా కొంత ఆస్తులు నాగమణి పేరుతో ఉన్నాయని.. ఆ ఆస్తులు కూడా రాసిచ్చేయాలనే గొడవ జరుగుతుందంట.. భూమి అయితే రాసిచ్చిన నాగమణి.. మిగతా కొన్ని ఆస్తుల విషయంలో సమయం కోరిందని.. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న తమ్ముడు పరమేష్.. అక్క నాగమణిని చంపినట్లు చెప్పుకుంటున్నారు గ్రామస్తులు. 

Also Read :- హైదరాబాద్‎లో మహిళా కానిస్టేబుల్‎ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు

ఏదిఏమైనా కానిస్టేబుల్ నాగమణి హత్య విషయంలో పరువు హత్య ఒక్క కారణమే కాదనే వాదన నడుస్తుంది. మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో చిల్విగవ్వ ఇవ్వనని ముందే తెగేసి చెప్పినట్లు.. ఆ క్రమంలోనే గొడవ జరిగినట్లు.. అది ఏకంగా హత్యకు దారితీసినట్లు చెప్పుకుంటున్నారు గ్రామస్తులు.

అయినా సొంత అక్కను.. అల్లారుముద్దుగా ఎత్తుకుని పెంచిన అక్కను చంపటానికి ఆ తమ్ముడికి చేతులు ఎలా వచ్చాయో.. ఆ ఆలోచనే ఘోరంగా ఉంది.. కులాంతర వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం సొంత అక్కను చంపేస్తారా ఏంటీ.. టెక్నాలజీతో ప్రపంచం చిన్నదైనా.. మనస్సులే కాదు మనుషులు అస్సలు మారలేదు అనటానికి ఈ ఘోర ఘటనే నిదర్శనం..