కుంభమేళాకు వెళ్లి వైద్యం అందక మహిళ మృతి

కుంభమేళాకు వెళ్లి వైద్యం అందక మహిళ మృతి
  • సొంతూరు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో అంత్యక్రియలు పూర్తి

రామచంద్రాపురం, వెలుగు:  కుంభమేళాకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన మహిళ అనారోగ్యానికి గురవగా.. సమయానికి వైద్యం అందక మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన బిల్లా లక్ష్మి(58), తన కొడుకు కృష్ణతో పాటు, నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి గత శుక్రవారం ప్రయాగ్​రాజ్​ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో ఐదారు కిలోమీటర్లు నడిచివెళ్లడంతో లక్ష్మి ఆయాసం వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. 

వెంటనే తల్లిని కృష్ణ చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా జనం రద్దీగా ఉన్నారు.  సమీపంలోని మరో ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ డాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో పాటు కనీసం ఆక్సిజన్ అయినా అందించమని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. లక్ష్మికి ఆయాసం ఎక్కువై ఆదివారం తెల్లావారుజామున చనిపోయిందని కొడుకు కృష్ణ ఆవేదనవ్యక్తం చేశాడు. సోమవారం ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించామని చెప్పాడు.  ప్రయాగ్ రాజ్​లో  సరైన వైద్య సదుపాయాలు భక్తులకు అందకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరాడు.