డిప్రెషన్​తో డాక్టర్ సూసైడ్

డిప్రెషన్​తో డాక్టర్ సూసైడ్

ఎల్బీనగర్, వెలుగు: డిప్రెషన్​కు లోనైన ఓ మహిళా డాక్టర్ తాను ఉంటున్న అపార్ట్​మెంట్​లోని ఎనిమిదో ఫ్లోర్ ​నుంచి దూకి సూసైడ్ ​చేసుకుంది. ఈ ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్​రావు నగర్​కు చెందిన కాకర్ల నాగేశ్వరరావు కుటుంబం నాగోలు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ సహభావన అపార్ట్​మెంట్​లో ఉంటోంది.

నాగేశ్వరరావు కూతురు నిహారికరావు(29)కు రెండేండ్ల కింద డాక్టర్ మనోహర్షతో వివాహమైంది. మనోహర్ష ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తుండగా.. ఎంబీబీఎస్ ​పూర్తిచేసిన నిహారికరావు కొంత కాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటూ పీజీ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​అవుతోంది. ఈ క్రమంలో డిప్రెషన్​కు లోనైంది. తల్లిదండ్రులు ట్రీట్​మెంట్​ఇప్పిస్తున్నారు. 

అయితే నిహారికరావు గురువారం తాను ఉంటున్న అపార్ట్​మెంట్​8వ అంతస్తు నుంచి కిందికి దూకింది. పార్కింగ్​లోని కారుపై పడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే నిహారికరావు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగోలు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డిప్రెషన్ కారణంగా తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.