చిరంజీవి ఠాగూర్ సినిమాను తలపించేలా బాధితుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు. చనిపోయిన బాడిని ఆస్పత్రికి తీసుకెళ్తే.. ట్రీట్ మెంట్ చేస్తున్నట్లు డ్రామాలాడి డబ్బులు వసూల్ చేసే సీన్ ఈ సినిమాలో మనం చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చేసింది నల్లగొండ జిల్లాలో. చనిపోయిన మహిళకు చికిత్స పేరుతో డబ్బులు వసూల్ చేశారని ఆస్పత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మర్రిగూడ మండలం బీమనపల్లికి చెందిన లింగమ్మ అనే పెషేంట్.. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం నల్లగొండ ఐకాన్ ఆస్పత్రికి వెళ్లింది. పలు పరీక్షలు చేసి వైద్యులు.. కడుపులో గడ్డ ఉందని, దానిని ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పారు. అయితే,ఆపరేషన్ వద్దు అంటూ లింగమ్మ తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. కడుపునొప్పి తీవ్రం కావడంతో.. ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమై డిసెంబర్ 18వ తేదీ సోమవారం లింగమ్మ ఐకాన్ ఆస్పత్రిలో చేరింది. దీంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోఉన్న గడ్డను తొలగించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె చినిపోయింది. పేషెంట్ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా.. హాస్పిటల్ లో బిల్లు చెల్లించిన తర్వాతనే పేషంట్ ని చూడాలని కండిషన్స్ పెట్టడంతో.. లక్ష 50వేల రూపాయలు చెల్లించారు. అనంతరం పేషెంట్ చనిపోయిందని చెప్పడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చనిపోయిన పేషెంట్ కి ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపిస్తున్న ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకుని... ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.