ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఆసుపత్రిలో తెగిపడ్డ లిఫ్ట్.. ఒకరు మృతి

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఆసుపత్రిలో తెగిపడ్డ లిఫ్ట్.. ఒకరు మృతి

ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.. లిఫ్ట్ లో తెలెత్తుతున్న సాంకేతిక లోపాలు ఏకంగా మనుషుల ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన వరుస లిఫ్ట్ ప్రమాదాలు మరువక ముందే మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.. ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖమ్మంలోని ప్రసూన ఆసుపత్రిలో లిఫ్ట్ తెగిపడడంతో ఓ మహిళ మృతి చెందింది. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 

ఖమ్మంలోని ముదిగొండ మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సరోజమ్మ అనే 55ఏళ్ళ మహిళ గుండె సంబంధిత వ్యాధికి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. గుండెకు స్టెంట్ వేసిన తర్వాత లిఫ్ట్ లో ఐసీయూకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మహిళతో సహా ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.. మహిళకు చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగటంతో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లిఫ్ట్ నిర్వహణలో ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే మహిళ మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు బంధువులు. ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మృతురాలి బంధువులు.