- ఒడిశా మహిళతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి
- తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు
- సరోగసీ ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత్నం
- 9వ అంతస్తు నుంచి కిందపడి మృతి
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం.. సరోగసీ(అద్దెగర్భం) కోసం ఒడిశాకు చెందిన మహిళతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అది ఇష్టం లేక, ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. ఈ ఘటన రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో జరిగింది.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేశ్‌బాబు(55).. తన భార్య, తల్లితో కలిసి మై హోమ్ భూజా అపార్టుమెంట్లో 9వ ఫ్లోర్‌లోని ఈ--–901 ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. రాజేశ్‌బాబు దంపతులకు పిల్లలు లేరు.
దీంతో సరోగసీ ద్వారా పిల్లలు కనాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒడిశాకు చెందిన మీడియేటర్ సందీప్‌ను సంప్రదించాడు. అతడు అదే రాష్ట్రానికి చెందిన ఆశ్వితాసింగ్(25) అనే మహిళను సరోగసీ కోసం ఒప్పించాడు. ఈ క్రమంలో ఆమెకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు రాజేశ్‌బాబు ఒప్పందం చేసుకున్నాడు. అగ్రిమెంట్ మేరకు అక్టోబర్ 24న తన భర్త సంజయ్ సింగ్, నాలుగేండ్ల కుమారుడితో కలిసి అశ్వితాసింగ్ హైదరాబాద్ వచ్చింది. రాజేశ్‌బాబు ఇంట్లోనే ఓ గదిలో అశ్వితాసింగ్ ఉంటుండగా.. ఆమె భర్త, కొడుకు అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. అశ్వితాసింగ్తో అగ్రిమెంట్చేసుకున్న రాజేశ్‌బాబు.. సరోగసీకి చట్టప్రకారం అనుమతి కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం కోర్టు అనుమతి కోసం వేచి చూస్తున్నాడు.
చీరలతో దూకాలని ప్రయత్నించి..
కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటుండడం, రాజేశ్‌బాబు పలు రకాలుగా వేధింపులకు పాల్పడుతుండడంతో అశ్వితాసింగ్ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం భర్తకు ఫోన్ చేసి.. తనకు ఇక్కడ ఉండాలని లేదని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్పింది. అయితే సంజయ్‌సింగ్ ఆమెకు సర్ది చెప్పాడు. రాజేశ్‌బాబు ఇల్లు మొత్తం సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉండడం, తన భర్తతో కలిసి మాట్లాడే అవకాశం లేకపోవడంతో అశ్వితాసింగ్మనస్తాపానికి గురైంది. దీంతో కోపంతో తన గదిలోకి వెళ్లిపోయిన అశ్వితాసింగ్.. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పారిపోయేందుకు ప్రయత్నించింది.
తన మూడు చీరలను ఒకదానికి ఒకటి కట్టి, వాటి ద్వారా ఐదో అంతస్తులోని పోర్టికోకు వెళ్లి, అక్కడి నుంచి బయటపడాలని అనుకుంది. ఈ క్రమంలో చీరలను వేలాడదీసి బాల్కనీలో నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా 9వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు, రాజేశ్‌బాబుకు సమాచారం ఇచ్చారు. రాయదుర్గం పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.