అగ్గువకు కొనుడు.. సీసీఐలో అమ్ముడు

 అగ్గువకు కొనుడు.. సీసీఐలో అమ్ముడు
  • పత్తి కొనుగోలు కేంద్రాలే అడ్డాగా వ్యాపారుల దందా 
  • తీవ్రంగా నష్టపోతున్న రైతులుతేమ పేరుతో అధికారుల ఇబ్బందులుఋ
  • వ్యాపారులు తెచ్చిన పత్తి మాత్రం కొనుగోలు

ఖమ్మం రూరల్​ మండలం గుర్రాలపాడులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం కూసుమంచి మండలానికి చెందిన మహిళా రైతు పత్తిని తీసుకొని వచ్చారు. 18కి పైగా తేమ శాతం ఉందంటూ సిబ్బంది ఆ పత్తిని రిజెక్ట్ చేశారు. తన కళ్ల ముందే వ్యాపారికి చెందిన పత్తిని అధిక తేమ శాతం ఉన్నా కొనుగోలు చేసి, తాను తీసుకువచ్చిన పత్తిని తీసుకోకపోవడంతో ఆ రైతు నిలదీశారు. కొనుగోలు కేంద్రంలోని పత్తి బస్తాల్లో తేమ శాతాన్ని చూపించాలని నిలదీయగా, మిషన్​ తో చెక్​ చేశారు. అది కూడా 18 శాతం ఉండగా.. వ్యాపారులు, సీసీఐ సిబ్బంది మధ్య ఉన్న సీక్రెట్ మిలాఖత్ బయటపడింది. 

ఖమ్మం, వెలుగు: జిల్లాలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో జోరుగా రీ సైక్లింగ్ దందా నడుస్తోంది. రైతుల దగ్గర అగ్గువకు పత్తిని కొంటున్న వ్యాపారులు దాన్ని మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతున్నారు. తెలిసిన రైతుల పేర్ల మీద ఆన్​ లైన్​ లో ఎంట్రీ చేయిస్తూ, సీసీఐ సిబ్బంది సపోర్టుతో వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక సీసీఐ అధికారి, సపోర్టింగ్ స్టాఫ్ ఉండగా.. వాళ్లు కూడా వ్యాపారులతో మిలాఖత్ కావడంతో ఈ దందా నడుస్తోంది. 

రైతులు తెచ్చిన పత్తికి తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. రైతులు తమంతట తామే ధర తగ్గించైనా పత్తిని కొనుగోలు చేయాలని బతిలాడుకునే పరిస్థితి తీసుకువస్తున్నారు. అదే సమయంలో వ్యాపారులు తెచ్చిన పత్తి వాహనాలకు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. 

ఖమ్మం మార్కెట్లో నిలువుదోపిడీ!

ఖమ్మం మార్కెట్ కు సోమవారం రైతులు 22 వేల బస్తాల పత్తిని తీసుకువచ్చారు. ఇందులో జెండా పాటగా రూ.6900 ధర నిర్ణయించారు. సుమారు వెయ్యి బస్తాలకు మాత్రమే ఈ రేటు దక్కింది. మిగిలిన 21 వేల బస్తాల పత్తిని క్వింటా రూ.6 వేల నుంచి రూ.6500 లోపు ధరకే వ్యాపారులు కొన్నారు. మాయిశ్చర్​ మిషన్​ లేకుండానే పత్తిని చేత్తో పట్టుకొని చూసి మాత్రమే రేటు నిర్ణయిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. మార్కెట్ కు పత్తి తీసుకువస్తే కూడా ఎక్కువ రేటు దక్కుతుందన్న ఆశ లేకపోవడంతో ఇంటి దగ్గరే క్వింటాకు రూ.5800 వేల లోపు ధరకు అమ్మేసుకుంటున్నారు. 

జిన్నింగ్ మిల్లుల యజమానులే బ్రోకర్ లు

ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, వైరా, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో 9 చోట్ల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు 85 మంది రైతుల నుంచి 173 మెట్రిక్​ టన్నుల పత్తిని కొన్నారు. సీసీఐ రూల్స్​ ప్రకారం.. 8 శాతం తేమ ఉంటే క్వింటాకు రూ.7521, 10 శాతం తేమ ఉంటే రూ.7370, 12 శాతం ఉంటే రూ.7220 రేటు ఫిక్స్​ చేశారు. అంతకంటే ఎక్కువ తేమ శాతం ఉంటే పత్తిని రిజెక్ట్ చేస్తున్నారు.

ఇదే అదనుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతులు తీసుకువచ్చిన పత్తిని తక్కువ ధరకు కొని, అదే పత్తిని మళ్లీ సీసీఐకి అమ్ముతున్నారు. ఉన్నతాధికారులు సీసీఐ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేసి, కొనుగోలు కేంద్రాల్లోని రైతుల వివరాలను క్రాస్​ చెక్ చేస్తే వ్యాపారుల దందాకు అడ్డుకట్ట పడే అవకాశముంది. 

సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలకేంద్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ కలిసి ప్రారంభించారు. 22 బొలెరో వాహనాల్లో పత్తిని రైతులు అమ్మేందుకు తీసుకురాగా, తేమ శాతం చూసిన సీసీఐ అధికారులు కేవలం 2 వాహనాల్లో పత్తిని మాత్రమే కొనేందుకు అంగీకరించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని మిగిలిన వాటిని రిజెక్ట్ చేశారు. దీంతో కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఇల్లందు మార్కెట్ సెక్రటరీ కారును రైతులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అదే జిన్నింగ్ మిల్లు యజమాని రైతుల దగ్గరకు వచ్చి క్వింటాకు రూ.6300 చొప్పున రెండు వాహనాల్లోని పత్తిని కొనుగోలు చేశారు. ఈలోగా ఈ రీసైక్లింగ్ వ్యవహారాన్ని గుర్తించిన మీడియా ప్రతినిధులు అక్కడికి రావడంతో, మిగిలిన వాహనాలను అక్కడి నుంచి పంపించేశారు.