కూతురు సూసైడ్..అత్తింటికి నిప్పంటించిన పేరెంట్స్

  • యూపీలో అత్తామామ సజీవ దహనం

న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కారణంగా ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. అది తెలిసి ఆమె తల్లిదండ్రులు.. అత్తామామల ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆమె అత్త, మామ ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ఈ ఘటన జరిగింది. సిటీలోని ఝల్వా ప్రాంతానికి చెందిన అన్షిక కేసర్వాణికి కిందటేడాది ఫిబ్రవరిలో అదే ప్రాంతానికి చెందిన అన్షు అనే వ్యాపారితో పెండ్లయింది.

ఆమె సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలిసి అన్షు ఇంటికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు.. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే అన్షిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆమె అత్తింటి వారితో గొడవపడ్డారు. ఆ కోపంలో వాళ్ల ఇంటికి నిప్పంటించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే కేసర్వాణి అత్తామామలు సజీవదహనమయ్యారు. వారి డెడ్​బాడీలను వెలికితీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మంటలంటుకుని ఆమె భర్తతో పాటు ఆడపడుచు, భర్త తమ్ముడి భార్యకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.