మధ్యప్రదేశ్‌లో ఓ ఉదాసీనత దృశ్యం అందరిని కలిచివేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు లేక.. ఓ చిన్నారికి నేల పైనే కూర్చోబెట్టి రక్తం ఎక్కించారు. ఆ రక్తం ఎక్కించే బ్యాగ్ ను తల్లి చేతిలో పట్టుకొని ఆ చిన్నారి పక్కనే నిలబడి ఉంది. ఈ ఘటన సత్నా జిల్లాలో జరిగింది. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడంతో తల్లి సాయంతో స్థానిక మైహార్ సివిల్ ఆస్పత్రిలో చేరిన 15ఏళ్ళ చిన్నారి విషాద కథ ఇది. దవాఖానాలో ఖాళీ బెడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ చిన్నారికి నేలపైనే వైద్యం చేయవలసిన దుస్థితి ఏర్పడింది.
ఆ చిన్నారిని నేల మీదే కూర్చోబెట్టిన అక్కడి సిబ్బంది.. తన తల్లి పక్కన నిలబడి ఉండగా.. తన చేతిలో రక్త మార్పిడి బ్యాగ్ ను ఉంచారు. తద్వారా ఆ చిన్నారికి రక్తం ఎక్కించారు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. అక్కడి కలెక్టర్ అనురాగ్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాలని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ అవధియాను ఆదేశించారు. విచారణ అనంతరం మైహార్ హాస్పిటల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ ప్రదీప్ నిగమ్‌కి ఒక ఇంక్రిమెంట్, స్టాఫ్ నర్సు అంజు సింగ్‌కి రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.