
తిర్యాణి,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి మంట కాగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై సీహెచ్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం గిన్నెదరి సాలెగూడకు చెందిన దేవేంద్ర(31)కు ఆరు నెలల కింద మండలంలోని గుండాల(దాబాగూడ)కు చెందిన కుడిమెత నాగేశ్ తో పెండ్లయింది. ఇటీవల దేవేంద్ర అనారోగ్యానికి గురికావడంతో పుట్టింటికి వచ్చింది.
సోమవారం ఉదయం ఇంటి వద్ద చలిమంట వేయగా, దేవేంద్ర అక్కడికి వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆమె నైటీకి మంటలు అంటుకున్నాయి. దేవేంద్ర కేకలు విన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫస్ట్ఎయిడ్తర్వాత ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయింది. మృతురాలి తండ్రి మర్సుకోల శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.