![కోర్టు ముందే మహిళ ఆత్మహత్యాయత్నం](https://static.v6velugu.com/uploads/2025/02/woman-incident--in-front-of-ibrahimpatnam-courthyderabad_df3Rih4BYc.jpg)
- భర్త ఆస్తి స్వాధీనం విషయంలో న్యాయవాదులు సహకరించట్లేదు
- పైసల్లేక బిడ్డల పెండ్లిళ్లు చేయలేకపోతున్నానని ఆవేదన
ఇబ్రహీంపట్నం, వెలుగు: రెండో పెండ్లి చేసుకున్న భర్త విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఇప్పటికీ న్యాయం జరగడం లేదంటూ కోర్టు ఎదుటే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రత్యేక్ష సాక్షులు, పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కేసీ తండాకు చెందిన జేర్పుల కమలమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురుకు పెండ్లి జరగగా, మరో ఇద్దరు అమ్మాయిలకు వివాహం కావాల్సి ఉంది. ఆమెను భర్త భద్రియ వదిలేసి మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
దీంతో భర్త ఆస్తిలో వాటా కోసం కమలమ్మ 2021లో కేసు వేయగా, అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ భూమిని స్వాధీనం చేసుకునే విషయంలో తన తరఫున పోరాడుతున్న న్యాయవాదులు సరియైన సహాయం అందించడం లేదని కమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పైసల్లేక బిడ్డలపెండ్లిళ్లు చేయలేకపోతున్నానని కన్నీరుమున్నీరు విలపించారు. ఇదే విషయమై సోమవారం ఇబ్రహీంపట్నం 15వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పక్కనే ఉన్న స్థానికులు ఆమె అడ్డుకొని నచ్చజెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించడంతో వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.