మందుపాతర పేలి మహిళకు గాయాలు

మందుపాతర పేలి మహిళకు గాయాలు
  • బెడం మల్లన్న యాత్రకు వెళ్తుండగా తెలంగాణ - ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ 
  • సరిహద్దులోని ఒక్కడుగుట్ట వద్ద ఘటన
  • జెట్టీ కట్టి 30 కిలోమీటర్లు మోసుకొచ్చిన యాత్రికులు

వెంకటాపురం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో  ఓ మహిళకు తీవ్ర గాయం అయింది. వెంకటాపురం మండలం చొక్కాల, వీఆర్కేపురం గ్రామాలకు చెందిన సుమారు 130 మంది గురువారం తెలంగాణ – ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ సరిహద్దులో దట్టమైన అడవిలో కొలువైన బెడం మల్లన్న యాత్రకు బయలుదేరారు. మధ్యాహ్నం రెండు గంటల టైంలో పామునూరు, జెల్ల గ్రామాలు దాటుకుంటూ ఒక్కడుగుట్ట వద్దకు చేరుకున్నారు. 

చొక్కాల గ్రామానికి చెందిన డర్రా సునీత గుట్ట ఎక్కుతున్న క్రమంలో మందుపాతరపై కాలు వేయడంతో అది పేలింది. దీంతో ఎడమ కాలు పాదానికి తీవ్ర గాయం అయింది. దీంతో భయపడిన యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే రవాణా సదుపాయాలు లేకపోవడంతో జెట్టీ కట్టి గాయపడిన సునీతను మోసుకుంటూ 30 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రి 9 గంటలకు వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. సునీతను పరిశీలించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం ఎస్సై అశోక్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చి వివరాలు సేకరించారు.