భర్తతో గొడవ.. కూతురితో కలిసి బావిలో దూకిన మహిళ

భర్తతో గొడవ.. కూతురితో కలిసి బావిలో దూకిన మహిళ

జనగామ అర్బన్, వెలుగు: భర్తతో గొడవ పడిన ఓ మహిళ రెండేండ్ల కూతురిని బావిలో వేసి తానూ దూకింది. చిన్నారి చనిపోగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జనగామ జిల్లా గానుగుపహాడ్‌‌ సమీపంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...గానుగుపహాడ్‌‌ గ్రామ శివారులోని ఏసీ రెడ్డి నగర్‌‌కు చెందిన ఆకుల రమేశ్‌‌, గౌరీ ప్రియ భార్యాభర్తలు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన గౌరీప్రియ తన రెండేండ్ల కూతురు శ్రీప్రగతిని తీసుకొని బుధవారంతెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. 

తర్వాత గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో కూతుర్ని వేసిన అనంతరం తాను కూడా దూకింది. గమనించిన స్థానికులు వెంటనే బావిలోకి దిగి తల్లికూతురిని బయటికి తీశారు. చిన్నారి శ్రీప్రగతి చనిపోగా, గౌరీప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. సమాచారం అందుకున్న జనగామ ఎస్సై రాజేశ్‌‌కుమార్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గౌరీప్రియ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ దామోదర్‌‌రెడ్డి తెలిపారు.