మొబైల్ ఫోన్‌ కోసం సాహసం.. మెట్రో ట్రాక్‌పైకి దూకిన మహిళ

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి వస్తువు అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ దాని బానిసలే. తింటున్నా ఫోన్ నొక్కటమే.. పడుకున్నా ఫోన్ నొక్కటమే. ఆఖరికి దాని కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ ఫోన్‌ కోసం అలాంటి పనే చేసింది. పొరపాటున చేతిలో ఉన్న ప్లాట్ ఫామ్ పై పడగా.. దాన్ని తిరిగి పొందటం కోసం ట్రాక్‌పైకి దూకింది. ఈ ఘటన బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే..? 

సోమవారం సాయంత్రం 06:40 గంటల సమయంలో ఓ మహిళ బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రో స్టేషన్ వద్ద రైలు కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ పట్టాలపై పడిపోగా.. తిరిగి దాన్ని తీసుకునేందుకు ఆమె పట్టాలపై దూకింది. వెంటనే మహిళ పట్టాలపై దూకడాన్ని గమనించిన మెట్రో సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 

విద్యుత్ అంతరాయం కారణంగా సాయంత్రం 6.40 నుండి 6.55 గంటల మధ్య 15 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పర్పుల్ లైన్.. కెంపేగౌడ ఇంటర్చేంజ్ స్టేషన్లలో రద్దీ నెలకొంది. సాయంత్రం అందునా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. నిల్చునేందుకు కూడా స్థలం లేకుండా పోయిందని ప్రయాణికులు తెలిపారు. ఫోన్ తీసుకున్న అనంతరం ఆమె సహ ప్రయాణికుడి సహాయంతో ప్లాట్‌ఫారమ్‌పై రాగా, తిరిగి రైళ్ల రాకపోకలను మెట్రో అధికారులు పునరుద్ధరించారు.