పుష్ప మూవీతో ధియేటర్ల దగ్గర పరేషాన్లు : ఫ్యాన్స్ హంగామాతో సామాన్యులు బలి

  • తొక్కిసలాటలో మహిళ మృతి, కొడుకు పరిస్థితి విషమం
  • ఏపీలో టీడీపీ , వైసీపీ నేతల మధ్య ఘర్షణ
  • చెన్నూరులో సినిమా చూపిస్తలేరని అద్దాలు ధ్వంసం
  • పుష్ప ది రైజింగ్.. అంతా ఆగమాగం
  • ఫ్యాన్స్ హంగామాకు సామాన్యులు బలి

హైదరాబాద్: ఒక్క సినిమా మూడు పరేషాన్లు తెచ్చిపెట్టింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన పుష్ప–2 సినిమా ఒక నిండు  ప్రాణం తీసింది. మరో బాలుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడేలా చేసింది. అటు ఏపీలో ఈ సినిమా ఏకంగా పొలిటికల్ రంగు పులుముకొంది. థియేటర్ల వద్ద టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సినిమా ప్రదర్శించడం లేదని ఆరోపిస్తూ ఏకంగా శ్రీనివాస థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. 

పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ హంగామాకు సామాన్యులు కష్టాల పాలవుతున్నారు. నిన్న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ లో నిర్వహించిన బెన్ ఫిట్ షోను వీక్షించేందుకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నతోపాటు సినిమా టీం రావడంతో అభిమానులు వాళ్లను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి ఆమె భర్త భాస్కర్, కుమారుడు శ్రీతేజ్, సన్వీకతో కలిసి దిల్ షుఖ్ నగర్ నుంచి థియేటర్ కు వచ్చారు. అల్లుఅర్జున్ రావడంతో ఫ్యాన్స్ ఒక్క సారిగా ఎగబడ్డారు. దీంతో రేవతి అక్కడికక్కడే మృతి  చెందింది. శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. 

Also Read:-అందుకే షారుఖ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ క్యాన్సిల్ చేసుకున్నాడా...?

ప్రస్తుతం ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదిలా ఉండగా ఏపీలోని తిరుపతి జిల్లా పాకాల రామకృష్ణ థియేటర్ వద్ద  'పుష్ప-2' సినిమాకు సపోర్టుగా వెలిసిన వైసీపీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బన్నీతో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడిన ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అని వాటిపై పేర్కొనడంతో వివాదం చెలరేగింది. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకరర్తలు రాళ్లు, కర్రలు, వేడి నీటితో దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.