
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులను వేధిస్తుండడాన్ని తట్టుకోలేక ఓ మహిళ తన కొడుకును హత్య చేసింది. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని న్యూ గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎలకపల్లి దూడమ్మ కొడుకు రాజ్‌కుమార్ (40), కోడలు సుకన్య, మనువడు శరత్‌తో కలిసి జీవిస్తోంది.
మద్యానికి బానిసైన రాజ్‌కుమార్ నిత్యం తాగొచ్చి తల్లితో పాటు భార్య, కొడుకును హింసించేవాడు. పలుమార్లు హెచ్చరించినా రాజ్‌కుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు. రాజ్‌కుమార్ గురువారం సాయంత్రం కూడా మద్యం తాగొచ్చి తల్లిని, భార్యను అసభ్యకరంగా తిడుతూ తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన దూడమ్మ రాజ్‌కుమార్ కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు ఉరి వేసి హత్య చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.