
లక్నో: ఓ మహిళ(30 )తన భర్తను, ముగ్గురు పిల్లలను వదిలేసి.. మతాన్ని మార్చుకుని మరీ 12వ తరగతి చదువుతున్న స్టూడెంటు(18)ను పెండ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. హసన్‌పూర్ సర్కిల్లోని సైదన్‌వాలి గ్రామంలో షబ్నం అనే మహిళ తన రెండో భర్త తౌఫిక్తో కలిసి నివసిస్తున్నది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. 2011లో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల తౌఫిక్ తన కాళ్లు, చేతులు కోల్పోయాడు. అప్పటి నుంచి షబ్నమే కుటుంబాన్ని పోషిస్తున్నది.
అయితే, వీరి ఇంటిపక్కనే 12వ తరగతి చదువుతున్న శివ అనే యువకుడి ఇల్లు ఉంది. రోజూ ఉదయం చేసే వాకింగ్ వల్ల శివతో షబ్నంకు పరిచయం ఏర్పడింది. ఇది స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. దాంతో శివ, షబ్నం పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తౌఫిక్ నుంచి షబ్నం విడాకులు కోరింది. హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకుంది. సాంప్రదాయ పద్ధతిలో ఆలయంలో శివను షబ్నం పెండ్లి చేసుకుంది.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తుండగా, మరికొందరు షబ్నం తన పిల్లల పట్ల బాధ్యతను విస్మరించిందని మండిపడుతున్నారు. శివ తండ్రి దత్తారామ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ పెళ్లిని మేం సమర్థిస్తున్నాం. వారు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం" అని పేర్కొన్నారు.