అచ్చంపేట, వెలుగు: వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆమె భర్తను కొట్టిచంపారు. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున(30), నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన సింధు(26) మూడేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు అచ్చంపేటలో నివాసం ఉంటున్నారు. నాగార్జున ఓ ప్రైవేట్హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా వీరి మధ్య కట్నం కోసం గొడవ జరుగుతున్నది. శుక్రవారం భార్యాభర్తలు గొడవ పడ్డారు.
అదే రోజు సాయంత్రం సింధు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, ఆమెను అచ్చంపేట పట్టణంలో ప్రథమ చికిత్స చేయించి, నాగర్‌కర్నూల్‌జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి డాక్టర్లు హైదరాబాద్ కు రెఫర్ చేశారు. హైదరాబాద్ తీసుకెళ్తుండగా సింధు చనిపోయింది. అనంతరం మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరుగుపయనమయ్యారు.
ఆమె మృతికి భర్తే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం అర్ధరాత్రి ఆమనగల్లు వద్ద నాగార్జునను మరో వాహనంలో ఎక్కించుకొని చితక బాదారు. దీంతో అతను చనిపోయాడు. సింధు డెడ్‌బాడీని అచ్చంపేట హాస్పిటల్‌కు, నాగార్జున డెడ్ బాడీనీ కల్వకుర్తి హాస్పిటల్‌కు తరలించారు. తమ కూతురు మృతికి భర్త నాగార్జునతో పాటు బంధువులు కృష్ణ, అతని భార్య అనిత వేధింపులే కారణమని సింధు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అచ్చంపేట ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు.